అదేపనిగా విచారణకు గైర్హాజరు.. షూటింగ్ కోచ్‌ను ప్రొక్లైమ్డ్ అఫెండర్‌గా ప్రకటించిన కోర్టు
ABN , Publish Date - Nov 15 , 2026 | 03:28 PM
మైనర్ షూటర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ షూటింగ్ మాజీ కోచ్ అంకుష్ భరద్వాజ్‌ను ఫరీదాబాద్ కోర్టు ప్రకటిత నేరస్థుడిగా (ప్రొక్లైమ్డ్ అఫెండర్) ప్రకటించింది. దర్యాప్తుకు హాజరుకాకుండా తప్పించుకుంటుండటంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మైనర్ షూటర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ షూటింగ్ మాజీ కోచ్ అంకుష్ భరద్వాజ్‌ను ఫరీదాబాద్ కోర్టు ప్రకటిత నేరస్థుడిగా (ప్రొక్లైమ్డ్ అఫెండర్) ప్రకటించింది. దర్యాప్తుకు హాజరుకాకుండా తప్పించుకుంటుండటంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నిందితుడిపై గతంలో సూరజ్‌కుండ్ పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 27న భరద్వాజ్ సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. రెండు రోజుల తర్వాత దర్యాప్తుకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే నిందితుడు విచారణకు హాజరుకాకపోవడంతో ఆ బెయిల్ రద్దయింది. ఆయన వరుసగా విచారణకు గైర్హాజరవుతున్న విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. భరద్వాజ్ ఆస్తుల పూర్తి వివరాలను సేకరించాలని సంబంధిత పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను ఆదేశించింది. సీఆర్‌పీసీ సెక్షన్ 83 ప్రకారం ఆస్తుల జప్తు ప్రక్రియ చేపట్టేందుకు ఈ వివరాలు అవసరమని పేర్కొంది.
భరద్వాజ్‌పై ఈ ఏడాది జనవరి 6న ఫరీదాబాద్‌లోని ఎన్‌ఐటీ మహిళా పోలీస్‌స్టేషన్‌లోనూ కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు 17 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్ ఫిర్యాదు చేసింది. 2025 డిసెంబర్ 16న ఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయ స్థాయి పోటీలకు శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఆమె ఫిర్యాదు చేసింది. మ్యాచ్‌లో తన ప్రదర్శనను విశ్లేషించేందుకు ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్ ప్రాంతంలోని ఓ హోటల్ లాబీలోకి రావాలని కోచ్ తనకు సూచించారని ఫిర్యాదులో పేర్కొంది. అక్కడికి వెళ్లిన తర్వాత తనను బలవంతంగా హోటల్ గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే క్రీడా జీవితాన్ని నాశనం చేస్తానని, అంతేకాకుండా కుటుంబ సభ్యులకు హాని తలపెడతానని కూడా కోచ్ బెదిరించారని తెలిపింది. కొన్ని రోజుల తర్వాత బాధితురాలు తన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంజాబ్‌లోని మొహాలీకి చెందిన భరద్వాజ్‌పై పోక్సో చట్టంలోని సెక్షన్ 6, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) లోని సెక్షన్ 351(2) కింద కేసు నమోదైంది. కాగా.. లైంగిక ఆరోపణల నేపథ్యంలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) భరద్వాజ్‌ను సస్పెండ్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్
గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ
దళిత సీఎం హామీ ఏమైంది.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్