పొలం పనుల్లో దంపతులు.. ఇంతలో ఏడుపు శబ్ధం.. దగ్గరకెళ్లి చూడగా..
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:22 PM
పొలం పనుల్లో నిమగ్నమై శ్రమిస్తున్న దంపతులకు పసికందు ఏడుపులు వినిపించాయి. దీంతో అక్కడికి వెళ్లి చూడగా హృదయాన్ని కదిలించే దృశ్యం కనిపించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూకు చెందిన జీతేంద్ర సింగ్, రీనా దేవి దంపతులు తమ పొలంలో పనులు చేస్తున్నారు. ఇంతలో ఓ పసికందు ఏడుపు శబ్ధం వినిపించింది. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక్కడ పసిపిల్లల శబ్ధం ఏంటా? అని కాసింత కంగారు పడ్డారు. శబ్ధం వచ్చే మార్గాన్ని అనుసరిస్తూ వెళ్లారు. అప్పుడే వారికి కళ్లెదురుగా హృదయాన్ని కదిలించే దృశ్యం కనిపించింది. ఎవరో కర్కోటకులు రోజుల వయసున్న చిన్నారిని పాక్షికంగా పూడ్చిపెట్టేశారు. వెంటనే పసిపాపపై ఉన్న మట్టిని జీతేంద్ర, రీనా దేవి తొలగించారు. నిన్నటి (శనివారం) ఉదయం యూపీలోని నాగ్లా బంజారా గ్రామంలో జరిగిందీ ఘటన.
వెంటనే ఆ దంపతులు స్థానికులకు విషయం చెప్పారు. అందరూ కలిసి పసికందును సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులకూ సమాచారం అందించారు. వైద్యులు పాపను పరీక్షించిన తరువాత చికిత్స చేశారు. కొంతసేపు పర్యవేక్షణలో ఉంచి.. ఆమెను చైల్డ్ హెల్ప్‌లైన్‌కు అప్పగించారు. అయితే ఆ పాపను తాను దత్తత తీసుకుంటానని జీతేంద్ర అధికారులను కోరారు. తాను, తన భార్య కలిసి పసిబిడ్డ ఆలనా పాలనా చూసుకుంటామని చెప్పారు. అయితే ఇందుకోసం చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులు ఆయనకు సూచించారు. అందాక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) సంరక్షణలోనే పాప ఉంటుందని స్పష్టం చేశారు.
మేం దత్తత తీసుకుంటాం..
ఆ చిన్నారిని తాము దత్తత తీసుకుంటామని జీతేంద్ర, రీనా దేవి దంపతులు చెబుతున్నారు. ‘మాకు ఆరుగురు మగపిల్లలున్నారు. కానీ ఒక్క కూతురు కూడా లేదు. ఆడబిడ్డను పెంచుకోవాలని మాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. నిన్న పొలంలో దొరికిన పాపను మేమే ఆప్యాయంగా పెంచుకోవాలనుకుంటున్నాం. చిన్నారికి సంబంధించి అన్ని బాధ్యతలూ దగ్గరుండి చూసుకుంటాం’ అని జీతేంద్ర తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
విడాకుల తరువాత జీవితంలోకి కొత్త నేస్తం.. వరాహంతో స్నేహబంధం!
యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ 181 సీట్లు అడుగుతోంది: అఖిలేశ్ యాదవ్