Share News

'సర్' తర్వాత పంజాబ్ ఓటర్ల తుది జాబితా విడుదల

ABN , Publish Date - Oct 12 , 2026 | 07:31 PM

ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) తర్వాత పంజాబ్‌లో ఓటర్ల తుది జాబితాను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం విడుదల చేసింది. సర్ ప్రక్రియలో 13.60 లక్షల ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటరు తుది జాబితాను ప్రకటించారు.

'సర్' తర్వాత పంజాబ్ ఓటర్ల తుది జాబితా విడుదల

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తర్వాత పంజాబ్‌లో ఓటర్ల తుది జాబితాను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం విడుదల చేసింది. సర్ ప్రక్రియలో 13.60 లక్షల ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటరు తుది జాబితాను ప్రకటించారు. 7,97,263 ఓటర్లను కొత్తగా జాబితాలో చేర్చారు. అలాగే 13,60,316 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. జూన్‌లో పంజాబ్‌లో సర్ ప్రక్రియ ప్రారంభమైనపుడు మొత్తం ఓటర్ల సంఖ్య 2,14,61,043గా ఉంది. సోమవారం ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాలో ఆ సంఖ్య 2,01,00,727గా మారింది. ఓటర్ల జాబితాలో పేరులేని ఓటర్లు ఈసీఐ యాప్ లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్ఓ) ద్వారా ఫాం6ను పూరించి రిజిస్టర్ చేసుకోవాలని ఎన్నికల అధికారులు తెలిపారు.


కాగా.. ఈ ఏడాది మే 14న ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాల ప్రకారం.. పంజాబ్‌లో జూన్ 25న సర్ ప్రక్రియ చేపట్టారు. సర్ మూడో దశలో పంజాబ్‌ను చేర్చారు. 2026 జూన్ 9 నాటికి రాష్ట్రంలో మొత్తం 2,14,61,043 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 35,49,036 మందికి నోటీసులు జారీ చేశారు. వెరిఫికేషన్ తర్వాత వారిలో 86,038 మందిని అనర్హులుగా ప్రకటించారు. ఇక మొత్తం ఓటర్లు 2,01,00,727 మందిలో 1,03,76,026 మంది పురుషులుకాగా.. 97,24,195 మంది మహిళలు ఉన్నారు. 506 మంది థర్డ్ జెండర్ వర్గం వారున్నారు. ఇక సర్ ప్రక్రియ సమయంలో ఓటర్ల సౌకర్యం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలింగ్ స్టేషన్లను రేషనలైజ్ చేశారు. దాంతో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 24,453 నుంచి 25,332కు పెరిగింది.


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్.. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడి!


స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 12 , 2026 | 07:59 PM