హత్రాస్.. ఉన్నావ్.. ఆర్జీ కర్.. ఇప్పుడు దిశా సాలియన్ కేసు.!
ABN , Publish Date - Sep 16 , 2026 | 04:33 PM
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హైప్రొఫైల్ కేసును పర్యవేక్షించే బాధ్యతలను సీబీఐ సీనియర్ ఆఫీసర్ సీమా పాహుజాకు అప్పగించారు.
ఇంటర్నెట్ డెస్క్: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హైప్రొఫైల్ కేసును పర్యవేక్షించే బాధ్యతలను సీబీఐ సీనియర్ ఆఫీసర్ సీమా పాహుజాకు అప్పగించారు. ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ హెడ్ ఆఫీస్‌లో స్పెషల్ క్రైమ్స్ యూనిట్ ఎస్పీగా పనిచేస్తున్నారామె.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మాజీ మేనేజర్‌గా వ్యవహరించిన దిశా సాలియన్.. 2020 జూన్ 8న ముంబైలో మృతిచెందారు. దిశా మరణించిన కొద్ది రోజులకే సుశాంత్ కూడా చనిపోవడంతో ఈ రెండు ఘటనలపై అప్పట్లో విస్తృత చర్చ జరిగింది. అయితే.. ఈ 2 కేసుల మధ్య ఎంతవరకూ సంబంధముందనే విషయం ఇప్పటివరకు బయటకురాలేదు. కాగా.. బాంబే హైకోర్టు సెప్టెంబరు 2న దిశా మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తులో తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించొద్దని స్పష్టం చేసింది.
సీబీఐలో సున్నితమైన, కీలక కేసుల దర్యాప్తులో పనిచేసిన అధికారిగా సీమా పాహుజాకు గుర్తింపు ఉంది. గతంలో హత్రాస్ ఘటన, ఉన్నావ్ అత్యాచార కేసు, కోల్‌కతా ఆర్జీ కర్ మెడికో అత్యాచారం వంటి పలు కేసుల్లో దర్యాప్తు బృందాలతో పనిచేసిన ఆమె.. 2021లో 'బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్'గా గోల్డ్ మెడల్ అందుకున్నారు.
అయితే.. దిశా మృతి కేసు ఆరేళ్ల కిందటిది కావడంతో దర్యాప్తు సంస్థకు పాత రికార్డులు, సాక్ష్యాలు, సాక్షుల వాంగ్మూలాలను మరోసారి పరిశీలించడం సవాలుగా మారనుంది. ఘటనకు సంబంధించిన పోలీస్ రికార్డులు, ఫోరెన్సిక్ ఆధారాలు, సంఘటనా స్థలానికి సంబంధించిన వివరాలను సీబీఐ పరిశీలించనుంది. ఈ ఘటనకు ముందు దిశా సాలియన్ కాబోయే భర్త రోహన్ రాయ్ ఇంట్లో జరిగిన సమావేశానికి హాజరైన వారి వాంగ్మూలాలనూ నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనీపై సీబీఐ తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో పలువురి పేర్ల ప్రస్తావన వచ్చినప్పటికీ.. వారిని నిందితులుగా పరిగణించలేమని, దర్యాప్తులో లభించే ఆధారాలను బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి:
యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలు.. తోసిపుచ్చిన కేంద్రం
పాక్ తయారీ ఫెయిర్‌నెస్ క్రీములపై కేంద్రం హెచ్చరిక