ఇకపై ఢిల్లీలో హాస్టల్ నిర్వహించాలంటే ఈ రూల్స్ తప్పనిసరి..
ABN , Publish Date - Sep 08 , 2026 | 09:37 PM
ఢిల్లీలో ఓ హాస్టల్ భవనం కూలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో హాస్టళ్ల నిర్వహణ కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురానుంది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేట్ హాస్టళ్ల నిర్వహణపై దృష్టి పెట్టింది. భద్రతా ప్రమాణాలను మరింత పెంచడానికి నియమ నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తోంది. తాజాగా దేశ రాజధానిలో సత్య నికేతన్ ప్రాంతంలో ఓ హాస్టల్ భవనం కుప్పకూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ ఘటనతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. హాస్టళ్లను నియంత్రించేందుకు ఓ ముసాయిదా బిల్లును రూపొందించింది. ఇందులో భాగంగా హాస్టళ్ల నిర్వహణ, భవన నాణ్యత వంటి వాటిని నిత్యం పరిశీలించనుంది.
హాస్టళ్లకూ లైసెన్స్..
ఇకపై లైసెన్స్ ఉంటేనే హాస్టళ్లను నడపాలని ఢిల్లీ మంత్రి ఆశిస్ సూద్ తెలిపారు. సరైన తనిఖీల తరువాతే లైసెన్స్‌లు మంజూరు చేస్తామన్నారు. ప్రతీ పీజీ(పేయింగ్ గెస్ట్)కి రిజిస్టేషన్ ప్రక్రియ ఉంటుందని వివరించారు. త్వరలో ప్రవేశపెట్టబోయే ప్రభుత్వ యాప్‌లో ఈ పీజీల రెంట్, ఆక్యుపెన్సీ లాంటి వివరాలన్నీ ఉంటాయని చెప్పారు. హాస్టళ్లను నిత్యం పర్యవేక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. భద్రతా విషయంలో రాజీపడితే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ ముసాయిదా ఇంకా చట్ట రూపం దాల్చలేదు. హాస్టళ్ల నిర్వహణలో కఠినమైన నియామావళితో భవిష్యత్తు ప్రమాదాలను అరికట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ప్రమాదకరంగా 200 హాస్టళ్లు..
తాజా ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్.. రాజధాని వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి 200 హాస్టళ్లు ప్రమాదకరంగా ఉన్నాయని గుర్తించింది. ఇంకా చాలా పీజీల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు కూడా తమ పీజీలో ఉన్న లోపాలను మీడియా ముందుకొచ్చి వివరిస్తున్నారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా ఈ విషయంపై చాలా సీరియస్‌గా ఉన్నారు. సత్య నికేతన్ హాస్టల్ ఘటన తరువాత ఆమె.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌తో పాటు కొందరు పైస్థాయి ఇంజినీర్లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కూలిపోయిన హాస్టల్ భవనం యాజమానిని కూడా అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
'మణిపురి కళాకారుడి హంతకులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం'
ఐక్యరాజ్యసమితి కొత్త మ్యాప్.. అరుణాచల్, అక్సాయ్ చిన్‌పై వేర్వేరు గీతలు.