ఐక్యరాజ్యసమితి కొత్త మ్యాప్.. అరుణాచల్, అక్సాయ్ చిన్‌పై వేర్వేరు గీతలు..
ABN , Publish Date - Sep 08 , 2026 | 04:33 PM
ఐక్యరాజ్యసమితి కొత్త ప్రపంచ పటం భారత్‌లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాల విషయంలో భారత, చైనా వాదనలకు సంబంధించిన వేర్వేరు సరిహద్దు గీతలను చూపించడం వివాదాస్పదంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐక్యరాజ్యసమితి (UN) కొత్త ప్రపంచ పటం భారత్‌లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాల విషయంలో భారత, చైనా వాదనలకు సంబంధించిన వేర్వేరు సరిహద్దు గీతలను చూపించడం వివాదాస్పదంగా మారింది. అయితే యూఎన్ ఈ రెండు ప్రాంతాలను చైనాలో భాగమని అధికారికంగా ప్రకటించలేదు. వివాదాస్పద ప్రాంతాలకు సంబంధించిన రెండు దేశాల వాదనలను సూచించే గీతలు మాత్రమే మ్యాప్‌లో కనిపిస్తున్నాయి (UN map Arunachal Pradesh Aksai Chin).
ప్రపంచ పటాల్లో భూభాగాల పరిమాణాలను మరింత వాస్తవికంగా చూపించాలనే ఉద్దేశంతో యూఎన్ జనరల్ అసెంబ్లీ 'కరెక్ట్ ది మ్యాప్' పేరుతో తీర్మానాన్ని సెప్టెంబర్ 4న ఆమోదించింది. దీనికి 164 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, అమెరికా వ్యతిరేకించింది. ఈ తీర్మానానికి భారత్ కూడా మద్దతు ఇచ్చింది. అయితే ఏదైనా నిర్దిష్ట మ్యాప్, ప్రొజెక్షన్ లేదా అంతర్జాతీయ సరిహద్దుల చిత్రీకరణను తాము ఆమోదించడం లేదని భారత్ స్పష్టం చేసింది (New UN world map).

కొత్త యూఎన్ మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్ చుట్టూ 'ఇండియన్ లైన్', 'చైనీస్ లైన్' అనే రెండు రకాల గీతలు కనిపిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు అస్సాంతో ఉన్న దక్షిణ సరిహద్దును 'చైనీస్ లైన్'గా చూపించారు. చైనాలోని టిబెట్ వైపు ఉన్న ఉత్తర సరిహద్దును 'ఇండియన్ లైన్'గా చూపించారు. అరుణాచల్ ప్రదేశ్‌కు నాగాలాండ్‌తో ఉన్న సరిహద్దును ఈ మ్యాప్‌లో చూపించలేదు. భారత్, చైనా రెండూ ఈ ప్రాంతంపై హక్కు కోరుతున్న నేపథ్యంలో, మ్యాప్‌లో రెండు దేశాల వాదనలకు సంబంధించిన గీతలనూ చూపించారు (Arunachal Pradesh map controversy).
ఇక, అక్సాయ్ చిన్‌ను భారత్ అధికారికంగా లద్దాఖ్‌లో భాగంగా పరిగణిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం చైనా నియంత్రణలో ఉంది. కొత్త యూఎన్ మ్యాప్‌లో అక్సాయ్ చిన్ విషయంలోనూ 'ఇండియన్ లైన్', 'చైనీస్ లైన్'గా రెండు వేర్వేరు గీతలు ఉన్నాయి. ఇక, జమ్మూ, కశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య 'లైన్ ఆఫ్ కంట్రోల్' (ఎల్‌ఓసీ)ను చుక్కల గీతతో చూపించారు. దానికి ప్రత్యేకంగా ఒక వివరణ కూడా ఇచ్చారు. భారత్, పాకిస్థాన్ అంగీకరించిన ఎల్‌ఓసీని ఈ గీత సుమారుగా సూచిస్తుందని, జమ్మూ, కశ్మీర్ తుది స్థితిపై ఇరు దేశాల మధ్య ఇంకా ఒప్పందం కుదరలేదని అందులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. 73 మందికి గాయాలు..
హిందీ జాతీయ భాష.. శివ రాజ్‌కుమార్ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో దుమారం..