Share News

'మణిపురి కళాకారుడి హంతకులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం'

ABN , Publish Date - Sep 08 , 2026 | 06:15 PM

దక్షిణ ఢిల్లీలోని 'కిలోకరీ' అర్బన్ విలేజ్‌లో 54 ఏళ్ల మణిపురి సంగీత ఉపాధ్యాయుడు హత్యకు గురైనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

'మణిపురి కళాకారుడి హంతకులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం'
Manipuri Musician Killing: Kiren Rijiju Says All 8 Accused Arrested

ఢిల్లీ, సెప్టెంబర్ 8: దక్షిణ ఢిల్లీలోని కిలోకరీ అర్బన్ విలేజ్‌లో 54 ఏళ్ల మణిపురి సంగీత ఉపాధ్యాయుడు చోంగ్‌థమ్ విక్రమ్ సింగ్ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. కేసుకు సంబంధించి నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారని, న్యాయస్థానంలో అత్యంత బలమైన ఛార్జ్‌షీట్ దాఖలు చేసి నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


అర్ధరాత్రి గొడవ.. పిడిగుద్దులతో దాడి

మాజీ సంగీత కళాకారుడు, ప్రైవేట్ గిటార్ టీచర్‌గా పనిచేస్తున్న విక్రమ్ సింగ్ నివాసం ఎదురుగా ఉన్న దాబా సిబ్బంది, డెలివరీ బాయ్స్ అర్ధరాత్రి సమయంలో గొడవ చేస్తూ బిగ్గరగా అరుస్తుండటంతో ఆయన కిందకు వచ్చి నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం పెరిగి, ఆ గుంపు విక్రమ్ సింగ్‌పై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడికి తెగబడింది. తీవ్రంగా గాయపడిన ఆయనను యైఫాబా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న(సోమవారం) ఉదయం మృతిచెందారు.


8 మంది నిందితుల అరెస్ట్

సౌత్ ఈస్ట్ డీఎస్పీ వినీత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 6వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఈ దాడి జరిగింది. ఘటన తీవ్రత కారణంగా రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 8 మంది నిందితులను (వీరిలో ఒక మైనర్) గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు స్థానిక దాబాల్లో పని చేసే వారిగా గుర్తించారు.

ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.


రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు ఆగ్రహం

ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శవాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని, ఇలాంటి తీవ్రమైన విషాదకర ఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదని హితవు పలికారు.


'బాధితుడి మరణాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? ప్రతి విషయానికి రాహుల్ గాంధీ బీజేపీని ఎందుకు లాగుతారు? ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా భారతీయులే. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వేగవంతమైన న్యాయం అందించడంపై దృష్టి పెట్టాలే తప్ప, బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడదు' అని రిజిజు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా

రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 08 , 2026 | 09:15 PM