Share News

వాంగ్‌చుక్‌‌ను ఆస్పత్రికి తరలించడం సరైన నిర్ణయమే: ఢిల్లీ హైకోర్టు

ABN , Publish Date - Jul 19 , 2026 | 05:01 PM

పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలించడం సరైన చర్యేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతోనే కేంద్ర ప్రభుత్వం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని, ఇది సరైన నిర్ణయమేనని పేర్కొంది.

వాంగ్‌చుక్‌‌ను ఆస్పత్రికి తరలించడం సరైన నిర్ణయమే: ఢిల్లీ హైకోర్టు

ఇంటర్నెట్ డెస్క్: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలించడం సరైన చర్యేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతోనే కేంద్ర ప్రభుత్వం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించిందని.. ఇది సరైన నిర్ణయమేనని పేర్కొంది. ఈ మేరకు వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి ఆంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దీనిని ఏకపక్ష లేదా చట్టవిరుద్ధమైన చర్యగా భావించలేమంది. వాంగ్‌చుక్ ప్రస్తుతం నిర్బంధంలో లేరని, ఆయన సమ్మతితోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారని వెల్లడించింది.


విచారణ సందర్భంగా.. వాంగ్‌చుక్ దాదాపు 17 నుంచి 18 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని న్యాయస్థానం గుర్తుచేసింది. ఆయన రక్తంలో చక్కెర, పొటాషియం నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయినట్టు వైద్య నివేదికలు సూచిస్తున్నాయని ప్రభుత్వం వివరించిందని, అందువల్లే ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని తెలిపింది.


ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తీసుకున్న ఈ చర్యను ఏవిధంగానూ తప్పుబట్టలేమని వ్యాఖ్యానించింది. ప్రతి ప్రాణం విలువైనదేనని, దానిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. వాంగ్‌చుక్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. ఎలాంటి నిర్బంధ ఉత్తర్వులు, క్రిమినల్ కేసు లేకుండా ఒక పౌరుడిని ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉంచడం సరైంది కాదన్నారు. తనకు నచ్చిన వైద్యులు, ఆస్పత్రిని ఎంచుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించని న్యాయస్థానం.. వాంగ్‌చుక్‌ను ఎవరూ నిర్బంధించలేదని, ఆయన స్వేచ్ఛగా ఉన్నారని స్పష్టం చేసింది. ఆయన సమ్మతితోనే వైద్య చికిత్స కొనసాగుతోందని.. దీనిని బలవంతపు చికిత్సగా గానీ, స్వేచ్ఛకు భంగం కలిగినట్లు చెప్పలేమని పేర్కొంది. సదరు ఆస్పత్రిలో ఆయనకు సాధారణ రోగుల కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పించామని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఆయన సతీమణి ఎప్పుడైనా కలిసేందుకు అవకాశముందని, ఇతర కుటుంబసభ్యులకూ పరిమితులకు అతీతంగా అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించింది.


మరోవైపు.. వాంగ్‌చుక్ హెల్త్ అప్డేట్స్‌కు సంబంధించి వైద్యులు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్‌లు వేర్వేరుగా ఉన్నాయని గీతాంజలి(వాంగ్‌చుక్ భార్య) కోర్టుకు తెలిపారు. దీనివల్ల ఆ వైద్యులపై నమ్మకం సన్నగిల్లిందన్నారు. అందుకే ఆయన్ను సఫ్దర్‌జంగ్ నుంచి మెదాంతా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి తమకు నచ్చిన చోట చికిత్స పొందే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. దీనికి ప్రభుత్వం స్పందిస్తూ.. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి అత్యంత సున్నితంగా ఉన్నందున మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందని తెలిపింది. ఆయన హెల్త్ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులతో పంచుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో ఈ కేసుపై ప్రస్తుతం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని భావించిన న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. మరో మూడు రోజుల్లో తమ నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.


ఇవీ చదవండి:

జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. 11 మంది మృతి

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

Updated Date - Jul 19 , 2026 | 05:12 PM