Share News

ఢిల్లీ మద్యం కేసు.. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ

ABN , Publish Date - May 14 , 2026 | 08:27 PM

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నట్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించారు.

ఢిల్లీ మద్యం కేసు.. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ
Justice Swarana Kanta Sharma and Arvind Kejriwal

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ధిక్కార చర్యలకు ఉపక్రమించిన అనంతరం.. తదుపరి విచారణ నుంచి జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకున్నారు. ఈ కేసును వేరే ధర్మాసనం విచారిస్తుందని ఆమె పేర్కొన్నారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. న్యాయమూర్తులను, కోర్టు విచారణలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారంటూ అరవింద్ కేజ్రీవాల్‌ సహా పలువురు ఆప్ నేతలపై కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు.


న్యాయపరమైన అంశాలను కోర్టులో ఎదుర్కోవాల్సింది పోయి, వాటిని సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. న్యాయవ్యవస్థపై వ్యతిరేకతను పెంచేలా ప్రచారం చేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై, న్యాయస్థానంపై అత్యంత హేయమైన, కోర్టు ధిక్కారపూరితమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని జస్టిస్ స్వర్ణకాంత శర్మ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఈ న్యాయ వివాదాన్ని ఓ బహిరంగ ప్రచారంగా మార్చేశారన్న ఆమె.. ఇది న్యాయ ప్రక్రియను అగౌరవపరచడమేనని అభిప్రాయపడ్డారు.


గతంలో తాను ఒక కళాశాల కార్యక్రమంలో ప్రసంగించిన ఓ వీడియోను ప్రస్తుత కేసుకు ముడిపెడుతూ, అసందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఇలాంటి చర్యలు ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా సాగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కేజ్రీవాల్‌తో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, పార్టీ నేతలు వినయ్ మిశ్రా, సౌరభ్ భరద్వాజ్‌లకు కూడా కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. న్యాయవ్యవస్థపై బురదజల్లేలా వ్యవహరించినందుకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది న్యాయస్థానం. రాజకీయ పోరాటాలు ప్రజాక్షేత్రంలో జరగాలని, కానీ న్యాయస్థానాల తీర్పులను, న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాలను వాడుకోవడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని ఈ సందర్భంగా కోర్టు హెచ్చరించింది.

కాగా.. మద్యం పాలసీ కేసులో ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు కొనసాగుతుండగా, తాజాగా హైకోర్టు తీసుకున్న ఈ ధిక్కార చర్యల నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


ఇవీ చదవండి:

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?

Updated Date - May 14 , 2026 | 09:40 PM