నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
ABN , Publish Date - May 14 , 2026 | 05:01 PM
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో అరెస్టైన నిందితులను కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ 2026 పరీక్షలో పేపర్ లీక్ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారిని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో నేడు హాజరుపరిచారు.
ఈ పేపర్ లీక్ ఘటనపై గత మంగళవారం కేసు నమోదు చేసిన తర్వాత సీబీఐ అధికారులు దూకుడు పెంచి వీరిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాసిక్(మహారాష్ట్ర)కు చెందిన శుభమ్ ఖైర్నార్, జైపూర్(రాజస్థాన్)కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్, వికాస్ బివాల్, గురుగ్రామ్ (హరియాణా)కు చెందిన యశ్ యాదవ్‌లను అరెస్టు చేశారు. ఈ కేసులో భాగంగా సంబంధిత ఇతర వ్యక్తులపైనా దర్యాప్తు కొనసాగిస్తున్నారు సీబీఐ అధికారులు.
ఈ ఘటనను మల్టీస్టేట్ నెట్‌వర్క్‌గా భావిస్తున్న సీబీఐ.. కేసును ఛేదించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది. విద్యార్థులు, పాఠశాలలు, విద్యాసంస్థల యాజమాన్యాల నుంచి వచ్చే సమాచారం సేకరించడం, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా లింక్‌లను పరిశీలించడం తదితర మార్గాల ద్వారా లీక్ వ్యవస్థ పూర్వాపరాలను కనుగొనేందుకు యత్నిస్తున్నారు. అయితే.. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ..
మూడో దశ 'సర్' అమలుకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో..