బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ..
ABN , Publish Date - May 14 , 2026 | 04:44 PM
దేశ రాజధానిలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్య, భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులతో ప్రధాని మోదీ ఫొటోలు దిగారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న బ్రిక్స్ (BRICS) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, పరిశీలక దేశాల ప్రతినిధులను ప్రధాని మోదీ కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఉన్నత స్థాయి దౌత్య సమావేశంలో పాల్గొంటున్న సభ్య, భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు దిగారు.
ఈరోజు (గురువారం) నుంచి మే 15 వరకు బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలకు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రధాని మోదీ రావడానికి ముందు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన వివిధ దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు, అలాగే పరిశీలక దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులకు కేంద్ర మంత్రి జైశంకర్ స్వాగతం పలికారు. ఈ సదస్సుకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో, ఇథియోపియా మంత్రి గెడియన్ తిమోతేవోస్ హెస్సెబోన్, యూఏఈ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఖలీఫా షహీన్ అల్ మరార్ హాజరయ్యారు.
ఈ సమావేశాల్లో ఆర్థిక సహకారం, వాణిజ్యం, అభివృద్ధి, ప్రపంచ, ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన కీలక అంశాలపై చర్చించనున్నారు. కాగా, ఈ ఏడాది జనవరి 1 నుంచి బ్రిక్స్ కూటమికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ కూటమికి భారత్ అధ్యక్షత వహించడం ఇది నాలుగోసారి. అలాగే 2012, 2016, 2021 సంవత్సరాల్లో కూడా బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ఆతిథ్యమిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
మూడో దశ 'సర్' అమలుకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో..
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసు.. తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ