ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసు.. తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
ABN , Publish Date - May 14 , 2026 | 03:06 PM
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తొలి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.
ఢిల్లీ: ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తొలి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. న్యూఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 7,500 పేజీల ఛార్జ్‌షీట్‌ను సమర్పించింది. 2025 నవంబర్ 10వ తేదీ సాయంత్రం డాక్టర్ ఉమర్ ఉన్ నబీ కారు నడుపుకుంటూ వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ పేలుడు ఘటనపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ సుదీర్ఘ దర్యాప్తు చేపట్టింది.
జమ్మూకాశ్మీర్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ సహా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కేసును విస్తృతంగా విచారించింది. 588 మంది వాంగ్మూలాలతో పాటు వివిధ రకాల సాక్ష్యాలను సేకరించింది. ఛార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పలు కీలక అంశాలను వెల్లడించింది. కారు పేలుడులో మృతిచెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ సహా 10 మందికి అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH) సంస్థతో సంబంధం ఉందని తెలిపింది. డాక్టర్ నబీతో పాటు ఆమిర్ రషీద్ మీర్, జసీర్ బిలాల్ వానీ, డాక్టర్ ముజమిల్ షకీల్, డాక్టర్ అదీల్ అహ్మద్ రథర్, డాక్టర్ షాహీన్ సయీద్, ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే, సోయాబ్, డాక్టర్ బిలాల్ నసీర్ మల్లా, యాసిర్ అహ్మద్ దార్‌లు అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు పేర్కొంది.
ఈ సంస్థ అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) అనుబంధ సంస్థగా ఎన్ఐఏ వెల్లడించింది. అయితే ఏక్యూఐఎస్, దాని అనుబంధ సంస్థలను 2018 జూన్‌లో భారత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించినట్లు తెలిపింది. వీరంతా భారత ప్రభుత్వాన్ని కూలదోసి షరియా పాలనను అమలు చేయడానికి కుట్రలు పన్నారని పేర్కొంది. ఇందుకోసం మారణాయుధాలను కూడా సమకూర్చుకున్నట్లు తెలిపింది.
నిందితులపై యూఏపీఏ చట్టం-1967, భారతీయ న్యాయ సంహిత-2023, ఎక్స్‌ప్లోసివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్-1908, ఆర్మ్స్ యాక్ట్-1959, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ నివారణ చట్టం-1984 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్లు, దర్యాప్తులో భాగంగా మరికొందరి పాత్ర కూడా వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించింది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎన్ఐఏ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి
మూడో దశ 'సర్' అమలుకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో..