Share News

శాసన మండలికి బైక్‌పై వెళ్లిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ABN , Publish Date - May 14 , 2026 | 07:43 PM

పశ్చిమాసియా సంక్షోభంతో పెట్రోల్, గ్యాస్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు తన కార్ల కాన్వాయ్‌కి బదులుగా ద్విచక్రవాహనాలను ఎంచుకున్నారు.

శాసన మండలికి బైక్‌పై వెళ్లిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
CM Devendra Fadnavis

ముంబై: పశ్చిమాసియా సంక్షోభంతో ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం పాటిస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, గ్యాస్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ఇటీవల భారతదేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు మోదీ పిలుపును ఆహ్వానించాయి. ఈ మేరకు ముఖ్యమంత్రులు, మంత్రులు తమ కాన్వాయ్‌ల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేడు (గురువారం) కార్ల కాన్వాయ్‌కి బదులుగా ద్విచక్రవాహనాలను ఎంచుకున్నారు.


ఈరోజు (గురువారం) మహారాష్ట్ర శాసన మండలికి కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ద్విచక్రవాహనంపై బయలుదేరారు. తన అధికారిక నివాసం నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై విధాన భవన్‌కు వెళ్లారు. సీఎంతో పాటు మంత్రి ఆశిష్ షెలార్, భద్రతా సిబ్బంది కూడా ద్విచక్రవాహనాలపై శాసన మండలికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎక్స్ వేదికగా ఫడ్నవీస్ పోస్టు చేశారు. 'ప్రధాని మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా దేశం కోసం ఇది నా వంతు సహకారం. ప్రతి ఒక్కరూ దేశం కోసం తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా' అంటూ ఆయన పోస్టు చేశారు.


కాగా, ప్రపంచ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా ఆయన తన కాన్వాయ్‌ని 15 నుంచి కేవలం రెండు కార్లకు తగ్గించారు. తాజా కాన్వాయ్‌లో రేంజ్ రోవర్, టయోటా ఫార్చ్యూనర్ మాత్రమే ఉన్నాయి. ప్రధాని పిలుపుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు కూడా తమ కాన్వాయ్‌ల సంఖ్యను తగ్గించుకున్నారు. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగులపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ క్వార్టర్ల నుంచి కార్యాలయాలకు వెళ్లేందుకు మెట్రోస్టేషన్ల మీదుగా ప్రత్యేక షటిల్ బస్సులను వినియోగించాలని తెలిపింది. ప్రజలు కూడా కార్లలో కాకుండా బస్సులు, మెట్రోలో ప్రయాణించాలని విజ్ఞప్తి చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ..

పొదుపు సూత్రాలపై ఢిల్లీ సర్కార్ స్పెషల్ ఫోకస్..

Updated Date - May 14 , 2026 | 08:05 PM