'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?
ABN , Publish Date - May 14 , 2026 | 06:14 PM
మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ రద్దైన సంగతి తెలిసిందే. అయితే.. త్వరలోనే రీ షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. మరి పరీక్ష ఎప్పుడు ఉండొచ్చు? అనే వివరాలను ఓ సారి పరిశీలిస్తే..
ఇంటర్నెట్ డెస్క్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - అండర్ గ్రాడ్యుయేట్(నీట్ యూజీ) 2026 రీ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. అకడమిక్ క్యాలెండర్ సహా ఇతర ప్రధాన పరీక్షలను దృష్టిలో ఉంచుకుని, కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) డీజీ తెలిపారు. అయితే.. ఈ పరీక్షను జూన్‌లో నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 2024లోనూ ఇదే తరహాలో నీట్ యూజీ పరీక్ష రద్దైన సందర్భంలో జూన్ 23న మరోసారి పరీక్ష జరిగింది.
ఎన్టీఏ అధికారుల ప్రకారం.. నీట్ పరీక్ష కోసం అభ్యర్థులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మే 2026లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలు, ఫీజుతో పాటు ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాలు వంటివి అలాగే కొనసాగుతాయి. అయితే.. అడ్మిట్ కార్డులను మాత్రం కొత్తగా జారీచేస్తారు. హాల్ టికెట్లు విడుదలైన తర్వాత neet.nta.nic.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.
దర్యాప్తు ముమ్మరం..
నీట్ యూజీ పేపర్ లీక్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ అధికారులు.. ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నాసిక్(మహారాష్ట్ర)కు చెందిన శుభమ్ ఖైర్నార్, జైపూర్(రాజస్థాన్)కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్, వికాస్ బివాల్, గురుగ్రామ్(హరియాణా)కు చెందిన యశ్ యాదవ్‌లను నేడు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే.. లీకైన ప్రశ్నపత్రం కోసం విద్యార్థుల నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నిందితులు వసూలు చేసినట్లు సమాచారం.
ఇవీ చదవండి:
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
మూడో దశ 'సర్' అమలుకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో..