క్షణాల్లో ఘోరం.. 100 మీటర్ల లోయలో పడ్డ కారు!
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:06 PM
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చక్రాత-తూని మార్గంలో ప్రయాణిస్తున్న ఓ కారు మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘోర రోడ్డు ప్రమాద భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చక్రాత్-తుని మోటార్ రోడ్డులోని చిల్లాడ్ వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఏకంగా 100 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. కేవలం 22 సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు కారులోని డాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
డెహ్రాడూన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ (UP37P6641) కలిగిన ఫోర్డ్ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఒక మూల మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని గట్టిగా ఢీకొడుతూ క్షణంలోనే సమీపంలోని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దుర్గేశ్ చౌదరి (39) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సునీల్ మండల్ (27), రిషభ్ అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లోయ అత్యంత లోతుగా ఉండటంతో పోలీసులు రాష్ట్ర విపత్తు స్పందన బృంద(SDRF) సాయం కోరారు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తాళ్ల సాయంతో 100 మీటర్ల లోతులోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడిన ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ డాష్‌క్యామ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. వాహనం అదుపు తప్పడం నుంచి లోయలోకి పడిపోవడం వరకు ఉన్న ప్రతి దృశ్యం గుండెలను పిండేసేలా ఉంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
ఓటమి భయంతోనే ఉపఎన్నికలను అడ్డుకుంటున్నారు: బీజేపీ ఎంపీ డీకే అరుణ
ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..
ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ ముందంజలో ఉంది: కిషన్‌రెడ్డి