మోదీకి హగ్, పినరయికి దూరం.. రాహుల్ వైఖరిని నిలదీసిన సీపీఎం
ABN , Publish Date - Jun 13 , 2026 | 07:30 PM
నాలుగు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇటీవల 'ఇండియా' కూటమి సమావేశమై ఐక్యతారాగం ఆలపించినప్పటికీ కూటమిలో అభిప్రాయ భేదాలు ఇంకా తొలిగినట్టు కనిపించడం లేదు. కేరళలో లెఫ్ట్ పార్టీ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ అధినాయకత్వాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి శనివారంనాడు బాహాటంగా ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇటీవల 'ఇండియా' కూటమి సమావేశమై ఐక్యతారాగం ఆలపించినప్పటికీ కూటమిలో అభిప్రాయ భేదాలు ఇంకా తొలిగినట్టు కనిపించడం లేదు. కేరళలో లెఫ్ట్ పార్టీ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ అధినాయకత్వాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి (MA Baby) శనివారంనాడు బాహాటంగా ప్రశ్నించారు. కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) బీజేపీతో రహస్య అవగాహన కుదుర్చుకుందంటూ రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపణలు చేశారని అన్నారు.
కేరళలో రాజకీయ విభేదాలున్న కారణంగానే పినరయి విజయన్‌ను తాను హగ్ చేసుకోలేదంటూ రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఎంఏ బేబీ తప్పుపట్టారు. రాజకీయ ప్రత్యర్థులైనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ పార్లమెంటులో హగ్ చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. మోదీని ఆలింగనం చేసుకోవడంలో రాహుల్‌కు ఎలాంటి ఇబ్బందీ లేనప్పుడు పినరయి విజయన్‌ను దూరం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
పినరయి విజయన్‌ను అరెస్టు చేయాలంటూ కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడంపై కూడా సీపీఎం నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటాలని చెబుతున్న నేతలు ఒకే విపక్ష కూటమికి చెందినవారైనప్పటికీ ఒకరిపై మరొకరు ఇలాంటి ఆరోపణలకు దిగడం సరికాదని అన్నారు. నిజంగా విపక్షాల ఐక్యతను కోరుకుంటే ఇండియా కూటమిలోని పార్టీలన్నీ దాన్ని ఆచరణలో కూడా చూపించాలని హితవు పలికారు.
ఇండియా కూటమి నేతలు జూన్ 8న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 25 విపక్ష పార్టీలకు చెందిన 50 మంది నేతలు పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేందుకు అంతా ఐక్యంగా ఉండాలని సమావేశంలో తీర్మానించారు. అయితే సీపీఎం నేత బేబీ తాజా వ్యాఖ్యలు కూటమిలో ఉద్రిక్తతలు, అసమ్మతులు ఇంకా తొలగలేదనే అభిప్రాయాలకు తావిస్తోందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
పంజాబ్‌కు ముందస్తు ఎన్నికలు... హింట్ ఇచ్చిన కేజ్రీవాల్
మమతకు మరో దెబ్బ.. రెబల్ క్యాంపులో టీఎంసీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్