Share News

పంజాబ్‌కు ముందస్తు ఎన్నికలు... హింట్ ఇచ్చిన కేజ్రీవాల్

ABN , Publish Date - Jun 13 , 2026 | 05:14 PM

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు గడువు కంటే ముందుగానే జరిగే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంకేతాలిచ్చారు. 2027 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 2026 నవంబర్‌లోనే ఎన్నికలు జరగవచ్చని అన్నారు.

పంజాబ్‌కు ముందస్తు ఎన్నికలు... హింట్ ఇచ్చిన కేజ్రీవాల్
Arvind Kejriwal

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు గడువు కంటే ముందుగానే జరిగే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంకేతాలిచ్చారు. 2027 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 2026 నవంబర్‌లోనే ఎన్నికలు జరగవచ్చని అన్నారు. 'ఆప్' ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ కొనసాగుతారని ప్రకటించారు. బటిండాలో శనివారంనాడు జరిగిన రోడ్‌షోలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు తక్షణం ఎన్నికల ప్రచారానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలకు కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.


ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా నిలిచిన ఓటర్లకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. బర్నాలా, మోగా, బటాలా, బటిండా మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లుగా ఆప్ కౌన్సిలర్లు ఎన్నికయ్యారని, పార్టీ పాలనపై ప్రజలకున్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోందని అన్నారు.


సీఎం అభ్యర్థిగా మాన్

ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ కొనసాగుతారని, మరో సారి మాన్ సీఎం అయ్యేందుకు పార్టీ కార్యకర్తలందరూ కృషి చేయాలని కేజ్రీవాల్ కోరారు. గత నాలుగేళ్లుగా పంజాబ్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని, మద్దతును సాధించిందని అన్నారు.


విపక్షాలపై విసుర్లు

పార్టీల పేరు చెప్పకుండా విపక్షాలపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఒకటి 'చిట్టా పార్టీ', మరొకటి 'ఫైటింగ్ పార్టీ', మూడో పార్టీ 'ఈడీ పార్టీ' అని అభివర్ణించారు. డ్రగ్స్ సమస్యలు, అంతర్గత పోరాటాలు, సెంట్రల్ ఏజెన్సీలతో ప్రత్యర్థులను భయపెట్టే పార్టీలుగా వారిని పోల్చారు. ప్రజాసంక్షేమ, అభివృద్ధి కోసం పని చేసే పార్టీ ఆప్ మాత్రమేనని, పంజాబ్ నేతల్లో అత్యంత నిజాయితీ కలిగిన ముఖ్యమంత్రుల్లో భగవంత్ మాన్ ఒకరని ప్రశంసించారు. గత ప్రభుత్వాలు అవినీతి, కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొన్నాయని, మాన్ హయాంలో అలాంటి ఆరోపణలు ఒక్కటి కూడా లేవని అన్నారు. ఏవైనా తప్పులు చేసి ఉంటే ఈడీ, సీబీఐ చర్య తీసుకుని ఉండేవని అన్నారు.


జూలై నుంచి మహిళలకు ఆర్థిక సాయం

పంజాబ్‌లో పలు సంక్షేమ పథకాలను ఆప్ అమలు చేస్తోందని, ఉచిత విద్యుత్, రూ.10 లక్షల వరకూ ఆరోగ్య బీమా ప్రజలకు అందిస్తోందని కేజ్రీవాల్ గుర్తుచేశారు. జూలై నుంచి అర్హత కలిగిన మహిళలకు ప్రతినెలా రూ.1,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. షెడ్యూల్డ్ కులాల మహిళలకు రూ.1,500 చొప్పున ఇస్తామని తెలిపారు. కేజ్రీవాల్ రోడ్‌షోలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, పంజాబ్ ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరా పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

అభిషేక్ నివాసంలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు

అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్

Updated Date - Jun 13 , 2026 | 06:38 PM