స్పీకర్ వద్దకు రెబల్ ఎంపీలు.. అధిష్ఠానం అప్రమత్తం.!
ABN , Publish Date - Jun 13 , 2026 | 02:22 PM
టీఎంసీలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. ఆ పార్టీకి చెందిన రెబల్ ఎంపీలంతా తమనే అసలైన టీఎంసీగా పరిగణించాలని కోరుతూ స్పీకర్‌ను కోరేందుకు సిద్ధమౌతున్నారు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఉపక్రమించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్(TMC)లో నెలకున్న అంతర్గత సంక్షోభం మరింత ముదురుతోంది. ఆ పార్టీకి చెందిన 19 మంది లోక్‌సభ సభ్యులు తమదే అసలైన టీఎంసీ వర్గమని ప్రకటిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి గుర్తింపు కోరేందుకు సిద్ధమౌతున్నారు. పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ పరిణామం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఈ తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్న కూచ్ బెహార్ ఎంపీ జగదీశ్ చంద్ర బర్మా బసునియా ఇప్పటికే స్పీకర్‌కు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. టీఎంసీ లోక్‌సభ సభ్యుల్లో తమకు మూడో వంతు మద్దతుందని వాదిస్తున్న తిరుగుబాటు వర్గం.. తమ బృందాన్నే అసలైన టీఎంసీగా గుర్తించాలని సభాపతిని కోరనున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఎన్‌డీఏకు మద్దతిచ్చే అవకాశాలపైనా చర్చలు జోరందకున్నాయి.
అయితే.. తిరుగుబాటు ఎంపీల వాదనకు చట్టపరమైన బలం లేదని పలువురు టీఎంసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం కూడా ఈ వాదన సరైంది కాదన్నారు. 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం, శాసనసభ లేదా పార్లమెంటులో విడిపోతూ ప్రత్యేక వర్గంగా ఏర్పడి గుర్తింపు పొందే అవకాశం లేదని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం కనీసం మూడింట రెండొంతుల మంది సభ్యులు మరో రాజకీయ పార్టీలో విలీనమైనప్పుడే అనర్హత నుంచి రక్షణ లభిస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై టీఎంసీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తిరుగుబాటు ఎంపీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న అంశంపై కీలక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి కొత్త సవాలుగా మారాయి.
ఇవీ చదవండి:
అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం.. పైలట్ మృతి.!
వరుస విజయాలతో దేశ రక్షణ రంగంలో డీఆర్‌డీఓ సరికొత్త చరిత్ర