Share News

అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్

ABN , Publish Date - Jun 13 , 2026 | 04:13 PM

టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని, ఆయన కావాలో, తాను కావాలో తేల్చుకోండంటూ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చిన ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శనివారంనాడు యూటర్న్ తీసుకున్నారు. అభిషేక్‌ను తన కొడుకుతో సమానమని అన్నారు.

అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్
Kalyana Banerjee and Abhisekh Banerjee

కోల్‌కతా: టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని, ఆయన కావాలో, తాను కావాలో తేల్చుకోండంటూ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చిన ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శనివారంనాడు యూటర్న్ తీసుకున్నారు. 'అభిషేక్‌ నా కొడుకుతో సమానం. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం తండ్రికి ఉంటుంది' అని అన్నారు.


సంతకాల ఫోర్జరీ కోసులో అభిషేక్ తరఫున కల్యాణ్ బెనర్జీ వాదిస్తున్నారు. ఈ కేసులో అరెస్టు నుంచి అభిషేక్ బెనర్జీకి హైకోర్టు తాత్కాలిక రక్షణ ఇచ్చింది. అయితే ఈ కేసులో కల్యాణ్ బెనర్జీ స్థానంలో మరొక లాయర్ వచ్చి చేరడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. అభిషేక్ అహంకారిగా మారిపోయాడని, ఎవరినీ గౌరవించడం లేదని, అభిషేక్ లేకుండా పార్టీ నడవదని మమతా బెనర్జీ భావిస్తే తాను పార్టీ నుంచి తప్పుకుంటానని ఆయన హెచ్చరించారు. దీనిపై అభిషేక్ ఆచితూచి స్పందించారు. కల్యాణ్ బెనర్జీ తనకంటే పెద్దవారని, ఆయన తన అభిప్రాయాలను చెప్పడంలో తప్పులేదని, చిన్నప్పటి నుంచి తనను ఆయన చూశారని, ఆయన గురించి తాను ఏమీ మాట్లాడలేనని అన్నారు. ఈ క్రమంలో అభిషేక్ తన కుమారుడి లాంటివాడని కల్యాణ్ బెనర్జీ ప్రకటించడంతో టీఎంసీ అధినాయకత్వం ఊపరి పీల్చుకుంది.


టీఎంసీ విలీనం, తిరుగుబాట్లపై...

కాగా, కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం కానుందంటూ కొందరు చేస్తున్న ఊహాగానాలను కల్యాణ్ బెనర్జీ శనివారంనాడు తోసిపుచ్చారు. కాంగ్రెస్‌లో టీఎంసీ కలవబోవడం లేదని చెప్పారు. రెబల్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తారంటూ వస్తున్న వార్తలపై సూచిగా స్పందించారు. 'వాళ్లు ఏమి చేయాలనుకుంటే అది చేయవచ్చు. బీజేపీ గొడుకు కింద పనిచేయాలనుకుంటున్నారు. ఇదంతా ఓ కుట్ర. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే బీజేపీతో పనిచేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. తమ నియోజకవర్గాలకు ఒక్కసారి కూడా వెళ్లని వాళ్లు ప్రజలకు చేసేదేముంటుంది? బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పీకనొక్కేసారు. గత నెలరోజుల్లో ఎలాంటి అభివృద్ధి చేశారు? మమ్మల్ని బీజేపీ వేధిస్తోంది, పోలీసులు వేధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఏ విపక్షానికి రాలేదు. 19 మంది ఎంపీలు వెళ్లిపోవాలనుకున్నా వాళ్లను బీజేపీ చేర్చుకోదు' అని కల్యాణ్ బెనర్జీ అన్నారు.


ఇవి కూడా చదవండి..

అభిషేక్ నివాసంలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు

స్పీకర్‌ వద్దకు రెబల్‌ ఎంపీలు.. అధిష్ఠానం అప్రమత్తం.!

Updated Date - Jun 13 , 2026 | 05:07 PM