Share News

అభిషేక్ నివాసంలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 03:00 PM

తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్‌ కోసం గాలిస్తున్న పోలీసులు కాళీఘాట్‌లోని అభిషేక్ నివాసానికి వెళ్లి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించినట్టు టీఎంసీ వర్గాలు తెలిపాయి.

అభిషేక్ నివాసంలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు
Abhisekh Banerjee

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhisekh Banerjee) నివాసంలో పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్‌ కోసం గాలిస్తున్న పోలీసులు కాళీఘాట్‌లోని అభిషేక్ నివాసానికి వెళ్లి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించినట్టు టీఎంసీ వర్గాలు తెలిపాయి. సోదాల అనంతరం పోలీస్ టీమ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. విషయం తెలిసిన పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అక్కడకు చేరుకున్నారు.


ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు ఆశచూపి కొందరి నుంచి సుమిత్ రాయ్ డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలకు సంబంధించి కోల్‌కతా పోలీసులు ఈ సోదాలు జరిపినట్టు చెబుతున్నారు. పోలీసుల తనిఖీలపై అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. పోలీసులు వచ్చినప్పుడు తన ఇంటికి తాళం వేసి ఉందని, తాళాలు పగులగొట్టి మరీ సోదాలు జరిపారని చెప్పారు. 'నా ఇల్లు మొత్తం గాలించారు. ఆయనను (సుమిత్ రాయ్) నేను దాచిపెట్టానో లేదో దర్యాప్తు ఏజెన్సీని అడగండి' అని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


సీఐడీ నోటీసు

దీనికి ముందు శుక్రవారంనాడు అభిషేక్ బెనర్జీకి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన ఆరోపణలపై జూన్ 16న తమ ముందు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొంది. నేరుగా నోటీసులు అందజేసేందుకు అభిషేక్ నివాసానికి సీఐడీ టీమ్ వెళ్లింది. అయితే ఆ సమయంలో ఆయన అక్కడ లేకపోవడంతో సుమారు రెండు గంటల వేచి చూసిన అధికారులు కార్యాలయంలోని ఉద్యోగులకు నోటీసు అందజేసి వెళ్లిపోయారు. అభిషేక్ వ్యాఖ్యలపై బాగుయాటి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు తొలుత విచారణ జరిపారు. అనంతరం కేసును సీఐడీకి అప్పగించారు.


మదన్ మిత్రా నివాసాలపై దాడులు

కాగా, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రాకు చెందిన పలు నివాసాలపై ఈడీ అధికారులు శనివారంనాడు దాడులు జరిపారు. భవానీపూర్‌లోని ఆయన నివాసంతో పాటు ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ దాడులు జరిపినట్టు తెలుస్తోంది. మున్సిపల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి ఈడీ ఈ దాడులు జరిపినట్టు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

స్పీకర్‌ వద్దకు రెబల్‌ ఎంపీలు.. అధిష్ఠానం అప్రమత్తం.!

వారం రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..

Updated Date - Jun 13 , 2026 | 03:06 PM