మమతకు మరో దెబ్బ.. రెబల్ క్యాంపులో టీఎంసీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:07 PM
తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో తలెత్తిన సంక్షోభం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి తాజాగా ఆ పార్టీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ షాక్ ఇచ్చారు. టీఎంసీ తిరుగుబాటు ఎంపీల గ్రూపులో చేరారు.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్లమెంటరీ పార్టీలో తలెత్తిన సంక్షోభం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి తాజాగా ఆ పార్టీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ షాక్ ఇచ్చారు. టీఎంసీ తిరుగుబాటు ఎంపీల గ్రూపులో శనివారంనాడు చేరారు. అనంతరం మరో అసమ్మతి ఎంపీ శతాబ్ది రాయ్‌తో కలిసి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. 19 మంది ఎంపీలతో కలిసి తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను సోమవారంనాడు కలుసుకోనున్నట్టు రెబల్స్ గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో సుదీప్ బందోపాధ్యాయ్ ఆ గ్రూపులో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
19 మంది ఎంపీలతో సంతకాలు
జూన్ 8 నుంచి టీఎంసీ అసమ్మతి ఎంపీల సంతకాల సేకరణ చేపట్టామని, 19 ఎంపీలు సంతకాలు చేశారని రెబల్ ఎంపీ చంద్ర బర్మ బసునియా వెల్లడించారు. ఇప్పటికే ఒకసారి స్పీకర్‌ను కలిసిన తాము ఈనెల 15న మరోసారి కలిసి తమ గ్రూపునే నిజమైన టీఎంసీగా గుర్తించాలని కోరనున్నట్టు చెప్పారు. ఓంబిర్లాను కలవడానికి ముందు టీఎంసీ రెబల్స్ న్యూఢిల్లీలో సమావేశం అవుతారని, అందులో పాల్గొనేందుకు 20 మంది ఎంపీలు న్యూఢిల్లీ చేరుకుంటారని అసమ్మతి వర్గ నేత ఒకరు చెప్పారు.
చట్టబద్ధత లేదు: టీఎంసీ
కాగా, తిరుగుబాటు వర్గం వాదనను టీఎంసీ తోసిపుచ్చింది. వారి వాదనకు ఎలాంటి చట్టబద్ధత లేదని పార్టీ ఎంపీ మహువా మొయిత్ర తెలిపారు. పార్టీలో చీలిక ప్రొవిజన్‌ను రాజ్యాంగంలోని 91వ సవరణ తొలగించినట్టు చెప్పారు. 19 మంది 'ద్రోహులు' పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేయాలని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మహువా మొయిత్ర పేర్కొన్నారు. 'ఆపరేషన్ లోటస్' పేరుతో ఫిరాయింపులకు బీజేపీ వ్యూహరచన చేసిందని, పార్టీని చీల్చాలనే ప్రయత్నం ఏమాత్రం సఫలం కాదని టీఎంసీ మరో ఎంపీ కీర్తి ఆజాద్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్
అభిషేక్ నివాసంలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు