Share News

మరో సీజేపీ నిరసనకు వాంగ్‌చుక్ మద్దతు.. ఈసారి సీఈసీకి వ్యతిరేకంగా..

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:31 PM

గతంలో సీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సోనమ్ వాంగ్‌చుక్ ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ చేపట్టబోతున్న నిరసనకు తన మద్దతు తెలిపారు.

మరో సీజేపీ నిరసనకు వాంగ్‌చుక్ మద్దతు.. ఈసారి సీఈసీకి వ్యతిరేకంగా..
sonam wangchu

ఇంటర్నెట్ డెస్క్: భారత ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అక్టోబర్ 2న నిర్వహించబోయే నిరసనకు సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన మద్దతును ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమానికి తాను భౌతికంగా హాజరు కాలేకపోవచ్చని తెలిపారు. దేశ నాయకుల్లో జవాబుదారీతనం పెంచే ఎలాంటి కార్యక్రమానికైనా తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యాన్నికి వెన్నెముక లాంటిదని, అటువంటి ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగితే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని వాంగ్‌చుక్ ప్రశ్నించారు.


దేశంలో న్యాయం కోసం పోరాడే ప్రతి రాజకీయ పార్టీకి తాను మద్దతుగా ఉంటానని సోనమ్ వాంగ్‌చుక్ చెప్పారు. జీవితాంతం శాంతిమార్గంలో నడుచుకున్న మహాత్మ గాంధీ జన్మదినం- అక్టోబర్ 2న నిర్వహించే నిరసన శాంతియుతంగా ఉంటుందన్నారు. గతంలో కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా సీజేపీ నిర్వహించిన నిరసనల్లో వాంగ్‌చుక్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన నిరాహార దీక్ష చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.


ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలోని పలు అంశాలపైన ఎన్నికల కమిషనర్లే అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ అభ్యంతరాలను కాదని సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఎన్నికల సంఘం ముందుకు వెళ్లిందని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల సంఘంలో కీలక నిర్ణయాలను తమకు తెలియకుండానే తీసుకున్నారంటూ ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, వివేక్‌ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇందుకోసమే అక్టోబర్ 2న నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతోంది.


ఈ వార్తలూ చదవండి

ఆ లేఖ సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై కాదు.. ఎన్నికల సంఘం వివరణ

సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.! రాజ్యాంగం ఏం చెబుతోందంటే?

తీవ్ర రూపం దాల్చిన విద్యార్థుల నిరసనలు.. యుద్ధ విమానంపైకి ఎక్కి..

Updated Date - Sep 27 , 2026 | 06:32 PM