ఆ లేఖ సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై కాదు.. ఎన్నికల సంఘం వివరణ
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:25 PM
ఎన్నికల కమిషనర్లు క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాశారంటూ జరిగిన రాద్ధాంతం మీద ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఆ లేఖ ఈసీఐ విధానపరమైన నిర్ణయాలకు సంబంధించింది కాదని, అది కేవలం డిప్యుటేషన్‌పై వచ్చిన ఓ అధికారి పనితీరుకు సంబంధించినదని వివరణ ఇచ్చింది.
ఢిల్లీ, సెప్టెంబర్ 27: ఎన్నికల కమిషనర్లు క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాశారంటూ జరిగిన రాద్ధాంతం మీద ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఆ లేఖ ఈసీఐ విధానపరమైన నిర్ణయాలకు సంబంధించింది కాదని, అది కేవలం డిప్యుటేషన్‌పై వచ్చిన ఓ అధికారి పనితీరుకు సంబంధించినదని వివరణ ఇచ్చింది. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో సమావేశమైన ఎలక్షన్ కమిషనర్లు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. క్యాబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్‌కు రాసిన లేఖ సీఈసీ (చీఫ్ ఎలక్షన్ కమిషనర్) జ్ఞానేష్ కుమార్‌పై రాసింది కాదని, ఈసీఐలో డిప్యుటేషన్‌పై ఉన్న ఓ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (DEC) పనితీరు, విధులకు సంబంధించినదని ఎన్నికల కమిషనర్లు తేల్చిచెప్పారు.
సీఈసీపైనే ఏదైనా ఫిర్యాదు చేయాల్సి వస్తే ప్రొటోకాల్ ప్రకారం ఆ లేఖను రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుందని, కానీ ఈ లేఖ క్యాబినెట్ కార్యదర్శికి పంపడం వల్ల ఇది డిప్యుటేషన్ అధికారికి సంబంధించిందేనని స్పష్టమవుతోందని కూడా పేర్కొంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించే ECINet సాఫ్ట్‌వేర్ వర్కింగ్, పనుల కేటాయింపు, ఐటీ విభాగానికి సంబంధించిన అధికారాలపై సీఈసీకి, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లకు మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు రాజకీయ కలకలానికి దారితీసిన నేపథ్యంలో పూర్తిస్థాయి ఎన్నికల సంఘం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
విపక్షాల ఆందోళన
ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించిన కథనం మేరకు ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు, SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై ఉన్న వివాదాల నేపథ్యంలో ప్రతిపక్షాలు సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు విపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసనలకు తెరతీశాయి.
ఎన్నికల సంఘం (ECI) నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే జరుగుతున్నాయని, ఐటీ విభాగం అధికారాలు లేదా విధానపరమైన నిర్ణయాలకు, ఈ లేఖకు సంబంధం లేదని, అది కేవలం ఓ అధికారి పనుల పునర్విభజన ఆర్డర్లకు సంబంధించిందని స్పష్టం చేసింది.
SIR నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే
దేశవ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఉత్తర్వులు మొత్తం కమిషన్ ఏకగ్రీవ ఆమోదంతోనే జారీ అయ్యాయని పూర్తిస్థాయి ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు కూడా ఈ SIR ఉత్తర్వులను సమర్థించిందని ఎన్నికల సంఘం గుర్తుచేసింది.
ECINet పోర్టల్‌ను క్షేత్రస్థాయి అధికారులు తమ చట్టబద్ధమైన అధికారాలకు అనుగుణంగా ఉపయోగిస్తున్నారని తెలిపింది. ఈ వ్యవస్థ నిబంధనల ప్రకారమే పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి సీనియర్ డీఈసీ (DEC) అధ్యక్షతన, IIT/IIITకి చెందిన స్వతంత్ర నిపుణుడితో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఐటీకి సంబంధించిన కొత్త నిర్ణయాలేవైనా ముందుగా అధికారుల కమిటీ చర్చించిన తర్వాతే ఎన్నికల సంఘం ఆమోదానికి వస్తాయని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్ ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి