Share News

గౌహతి యూనివర్సిటీ విద్యార్థిని నిమిషా ఠాకురియా మృతి.. తండ్రి సంచలన ఆరోపణలు..

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:25 PM

గౌహతి యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని నిమిషా ఠాకురియా మృతి ఘటన సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన యువతి విగతజీవిగా మారింది. అయితే, నిమిషా మృతిపై ఆమె తండ్రి సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

గౌహతి యూనివర్సిటీ విద్యార్థిని నిమిషా ఠాకురియా మృతి.. తండ్రి సంచలన ఆరోపణలు..
Nimisha Thakuria Case

దిస్‌పుర్: గౌహతి యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని నిమిషా ఠాకురియా(22) మృతి ఘటన సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన యువతి విగతజీవిగా మారింది. అయితే, నిమిషా మృతిపై ఆమె తండ్రి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తన కుమార్తెపై సామూహిక హత్యాచారం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. 'నా కూతురి పెదవులు, మెడ, నుదురు, చేతులపై స్పష్టమైన గాయాలు ఉన్నాయి. ఇది స్పష్టంగా గ్యాంగ్ రేప్, హత్య. సరైన, సమగ్ర దర్యాప్తు జరగాలి' అని అన్నారు. తన కుమార్తెకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


శుక్రవారం సాయంత్రం నిమిషా ఇంటి నుంచి బయటకు వెళ్లిందని యువతి తండ్రి తెలిపారు. బయటకు వెళ్లే ముందు రూ.2 వేలు అడిగినట్లు వెల్లడించారు. స్నేహితులతో వెళ్తున్నానని, పెట్రోల్, ఫుడ్ కోసం రూ.2 వేలు కావాలని అడిగిందన్నారు. తాను మాత్రం రూ.వెయ్యి ఇచ్చి పంపినట్లు ఆయన చెప్పారు. అయితే, తన భార్యకు శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు నిమిషా ఫోన్ చేసినట్లు తెలిపారు. ఆమె సహాయం కోసం ఏడుస్తూ.. 'నన్ను కొడుతున్నారు, ఛాతీపై తంతున్నారు' అని చెప్పిందన్నారు. దీంతో తమ కుటుంబం వెంటనే అజరా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిందని చెప్పారు. అయితే, అక్కడ ఓ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసిందన్నారు. ఆ తర్వాత నిమిషా మృతిచెందిన వార్త అందిందని ఆవేదన వ్యక్తం చేశారు.


కాగా, ధరాపూర్ ప్రాంతానికి చెందిన నిమిషా.. గరాల్‌లోని రుద్రాస్ కిచెన్ హోమ్‌స్టేలో అపస్మారక స్థితికి చేరుకుంది. హోమ్ స్టే సిబ్బంది, ఆమె ప్రియుడిగా భావిస్తున్న ఆశిక్ అలీ.. నిమిషాను గరాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. ఈ కేసులో ఆశిక్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిమిషా ఉరివేసుకోవాలని ప్రయత్నించి అపస్మారక స్థితికి చేరుకుందని, ఆమెను కాపాడేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులకు అలీ తెలిపాడు. ఆమె మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించాడు. తాజాగా నిమిషా తండ్రి ఆరోపణలతో కేసు కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

యూపీని ముంచెత్తిన భారీ వర్షాలు.. 56 మంది మృతి, వందలాది మూగజీవాలు బలి

యువకుడిపై చేయి చేసుకున్న ఢిల్లీ మంత్రి.. వీడియో వైరల్..

Updated Date - Sep 27 , 2026 | 06:29 PM