ఢిల్లీలో నిరసనల వేళ.. సీజేఐ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:10 PM
సీఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సుప్రీంకోర్టు వరకు ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఢిల్లీ నిరసనల వేళ న్యాయవాదుల రాకపోకలకు సంబంధించి సుప్రీంకోర్టు సీజేఐ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీ, అక్టోబర్ 12: సీఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సుప్రీంకోర్టు వరకు ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఢిల్లీ నిరసనల వేళ న్యాయవాదుల రాకపోకలకు సంబంధించి సుప్రీంకోర్టు సీజేఐ కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు.
నిరసనలు, ఆందోళనల పేరుతో న్యాయస్థానాల కార్యకలాపాలకు విఘాతం కలగకూడదని ఢిల్లీ పోలీసులకు సీజేఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భద్రతా ఆంక్షల వల్ల న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఇబ్బందులు పడకుండా రాకపోకలను సుగమం చేయాలన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ అంశాలపై విచారణల ద్వారానే పరిష్కారం సాధ్యమని, ప్రత్యేక భేటీలు కుదరవని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
సీఈసీ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మార్చ్
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ, ‘సర్’ ప్రక్రియను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటమి కొద్దిరోజులుగా నిరసనలు చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు సీఈసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మార్చ్ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ ర్యాలీలో మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఇండియా కూటమి నేతలు, కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు, నేతలు పాల్గొననున్నారు. యువత, విపక్ష పార్టీలు, పౌర సమాజ సంస్థలు మార్చ్‌లో పాల్గొనాలని రాహుల్ పిలుపునిచ్చారు. భారత ప్రజల తరఫున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పిస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
మరోసారి మెట్రో సేవలపై ఆంక్షలు
మరోవైపు సుప్రీంకోర్టు మార్చ్ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మరోసారి ఢిల్లీలో మెట్రో సేవలపై ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆరు మెట్రో స్టేషన్ల గేట్లు మూసి వేస్తున్నట్లు డీఎమ్‌ఆర్‌సీ ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. పటేల్ చౌక్, జన్‌పథ్, రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బరాఖంబా స్టేషన్ల గేట్లను ఈరోజు మూసివేయనున్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం.. కిలో రూ.49కే బీపీటీ సన్నాలు
విశాఖలో గ్యాస్ సిలిండర్‌కు నిప్పు.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్ర గాయాలు
Read Latest AP News And Telugu News