చమురు రవాణా నౌకపై డ్రోన్ దాడి.. గల్లంతైన ఇద్దరు భారతీయ నావికులు..
ABN , Publish Date - Oct 12 , 2026 | 08:44 AM
ఒమన్ తీరానికి సమీపంలో ఓ చమురు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ నావికులు గల్లంతయ్యారు. నౌకలో ఉన్న మరో తొమ్మిది మంది భారతీయులను అధికారులు రక్షించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఒమన్ తీరానికి సమీపంలో ఓ చమురు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ నావికులు గల్లంతయ్యారు. నౌకలో ఉన్న మరో తొమ్మిది మంది భారతీయులను అధికారులు రక్షించారు. ఈ విషయాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు (Indian Sailors Missing).
అక్టోబర్ 11న ఒమన్ ఉత్తర ప్రాంతంలోని సోహార్ నౌకాశ్రయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నికరాగ్వా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ అనే చమురు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. దాడి అనంతరం చేపట్టిన సహాయక చర్యల్లో తొమ్మిది మందిని రక్షించారు. అయితే మరో ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గల్లంతైన వారిని గుర్తించేందుకు స్థానిక తీర రక్షక దళం గాలింపు చర్యలు చేపట్టింది (Oman Drone Attack).
ఈ ఘటనపై కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ స్పందించారు. అక్టోబర్ 11న సోహార్ సమీపంలో ఎంటీ పెట్రో డాల్ఫిన్ (MT Petro Dolphin) నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలిపారు. అందులోని తొమ్మిది మంది భారతీయులు సురక్షితంగా బయటపడగా, ఇద్దరు గల్లంతైనట్లు వెల్లడించారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఒమన్ రాజధాని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ ఘటనపై స్పందించింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్.. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడి!
స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..