Share News

పంజాబ్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురి మృతి

ABN , Publish Date - Nov 16 , 2026 | 07:03 AM

పంజాబ్‌ రాష్ట్రంలోని ఫాజిల్కా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

పంజాబ్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురి మృతి
Punjab Road Accident

ఇంటర్నెట్ నెట్: పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫాజిల్కా-ఫిరోజ్‌పుర్ జాతీయ రహదారిపై థే కలందర్ అనే గ్రామానికి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు (టవేరా), ట్రక్కు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


తివానా కలాన్ గ్రామానికి చెందిన 16 మంది ఆదివారం ఉదయం ఫాజిల్కాలోని కర్ణి ఖేడా గ్రామంలో తమ బంధువుల ఇంట జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో థే కలందర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు కాగా, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి, అంబులెన్సుల ద్వారా ఫాజిల్కా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


ఆసుపత్రికి తరలించేలోపే ఐదుగురు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులను కారు డ్రైవర్ మన్‌ప్రీత్, దేశో బాయితో పాటు చిన్నారులు సచిన్, జాన్, గుర్లీన్ కౌర్‌లుగా గుర్తించారు. గాయపడిన 11 మందిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఫరీద్‌కోట్‌లోని గురు గోవింద్ సింగ్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి ఫాజిల్కా ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫాజిల్కా జిల్లా ఎస్పీ సతీందర్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే నరీందర్ పాల్ సింగ్, జలాలాబాద్ ఎమ్మెల్యే జగ్దీప్ కాంబోజ్ గోల్డీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి

విడాకుల తరువాత జీవితంలోకి కొత్త నేస్తం.. వరాహంతో స్నేహబంధం!

యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 181 సీట్లు అడుగుతోంది: అఖిలేశ్ యాదవ్

Updated Date - Nov 16 , 2026 | 07:13 AM