దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు..
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:35 PM
దేశ రాజధాని సహా పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లోని పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని సహా పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లోని పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మేరకు అప్రమత్తమైన ఆయా రాష్ట్రాల భద్రతా సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్‌జాస్ కాలేజ్, మిరాండా హౌస్‌లకు ఇవాళ (సోమవారం) బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
అప్రమత్తమైన కళాశాలల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు క్యాంపస్‌లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఢిల్లీ మేయర్ కార్యాలయానికి బెదిరింపు ఈ-మెయిల్ అందింది. ఈరోజు మధ్యాహ్నం 2:11 గంటల ప్రాంతంలో ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ కార్యాలయాన్ని పేల్చిస్తామని సందేశం పంపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చండీగఢ్‌లోని పలు పాఠశాలలు, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలకూ ఈరోజు ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పంజాబ్, హర్యానా సచివాలయాలకు, ఫిరోజ్‌పూర్ జిల్లా కోర్టుకు బెదిరింపు మెయిల్స్ అందాయి.
అధికారుల సమాచారంతో భద్రతా బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. అన్ని ప్రదేశాలల్లో బాంబు నిర్వీర్య బృందాలు మోహరించాయి. ముమ్మర తనిఖీలు చేపట్టాయి. అయితే, ఖలిస్థాన్ జాతీయ సైన్యం అని పిలుచుకునే ఓ బృందానికి చెందిన వ్యక్తి ఈ మెయిల్స్ పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ-మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు సైబర్ నిపుణులు ప్రస్తుతం పనిచేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు: రాహుల్