వృద్ధుడి దారుణం.. జామకాయ తెంపిందని నాలుగేళ్ల చిన్నారిని కట్టేసి..
ABN , Publish Date - Apr 06 , 2026 | 01:52 PM
హిమాచల్ ప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల ఓ చిన్నారిపై మాజీ ఆర్మీ ఉద్యోగి దారుణానికి ఒడిగట్టాడు. చెట్టునుంచి జామకాయ తెంపిందన్న కోపంతో చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి మరీ చిత్ర హింసలు పెట్టాడు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: నాలుగేళ్ల ఓ చిన్నారిపై మాజీ ఆర్మీ ఉద్యోగి దారుణానికి ఒడిగట్టాడు. చెట్టునుంచి జామకాయ తెంపిందన్న కోపంతో చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి మరీ చిత్ర హింసలు పెట్టాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉనా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో జామ చెట్టు ఉంది. దానికి భారీ సంఖ్యలో జామకాయలు కాశాయి. అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారి చెట్టుకు ఉన్న జామకాయను తెంపింది.
ఇది చూసిన మాజీ ఆర్మీ ఉద్యోగి బాలికపై రెచ్చిపోయాడు. బాలిక కాళ్లు, చేతులు కట్టేసి చిత్ర హింసలు పెట్టాడు. బాలిక విడిచిపెట్టమని ఎంత బ్రతిమలాడినా అతడి మనసు కరగలేదు. బాలిక అరుపులు విన్న ఓ వ్యక్తి అటువైపు వచ్చాడు. ఆ వ్యక్తిని చూడగానే ‘అంకుల్, నన్ను కాపాడండి’ అంటూ బాలిక వేడుకుంది. ఆ వ్యక్తి బాలికను విడిపించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కొద్దిసేపటి తర్వాత పెద్ద సంఖ్యలో జనం అక్కడికి వచ్చారు. బాలికను విడిపించి తీసుకెళ్లిపోయారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో జిల్లా అధికారులు, పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆదివారం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్థానిక పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మాజీ ఆర్మీ ఉద్యోగిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను.. అతి కిరాతకంగా చంపిన భర్త..
మైక్రో ఇరిగేషన్‌లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్: సీఎం చంద్రబాబు