పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు: రాహుల్
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:21 PM
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పుదుచ్చేరిలోని ప్రాంతీయ నాయకులను బీజేపీ పక్కనపెట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా పాలన సాగిస్తోందని విమర్శించారు.
లాస్‌పేట్: అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పుదుచ్చేరి (Puducherry)కి రాష్ట్ర హోదా కల్పిస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) హామీ ఇచ్చారు. పుదుచ్చేరిలోని ప్రాంతీయ నాయకులను బీజేపీ పక్కనపెట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా పాలన సాగిస్తోందని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 6 నెలల్లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపిస్తామని భరోసా ఇచ్చారు. లాస్‌పేట్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పుదుచ్చేరిలోని నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కొత్తగా 30,000 ఉద్యోగాల కల్పన, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్ల వరకూ సడలిస్తామని వాగ్దానం చేశారు. ప్రతి కుటుంబానికి రూ.20 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. పుదుచ్చేరిలో పారిశ్రామిక, వస్త్ర పరిశ్రమలు తగ్గిపోయాయని, 100 వరకూ ఫ్యాక్టరీలు మూతపడ్డాయని చెప్పారు. పాండిచ్చేరిలో నకలీ డ్రగ్స్ తయారీ రాకెట్ నడుస్తోందని, నకిలీ మందులు తయారవుతున్నాయనీ, అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవని తప్పుపట్టారు.
అన్ని కాంటాక్టుల్లోనూ ప్రభుత్వం 30 శాతం కమిషన్ తీసుకుంటున్న వ్యవహారం అందరికీ తెలిసిందేనని, ప్రభుత్వం కలెక్షన్ ఏజెంట్‌గా మారిందని రాహుల్ విమర్శించారు. ప్రతి టోల్‌గేట్ వద్ద బలవంతంగా ప్రజల నుంచి సొమ్ములు వసూళ్లు చేస్తున్నారని, ప్రజల నుంచే కాకుండా దేవుళ్లు, దేవాలయ భూములను కూడా ప్రభుత్వం ఆక్రమించుకుంటోందని ఆరోపించారు. కాగా, 30 మంది సభ్యుల పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
తృణమూల్ పాపాల చిట్టా విప్పుతాం