Share News

తృణమూల్‌ పాపాల చిట్టా విప్పుతాం

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:33 AM

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఆటలు ఇక సాగవని, ఆ పార్టీకి కౌంట్‌డౌన్‌ మొదలైందని ప్రధాని మోదీ అన్నారు.

తృణమూల్‌ పాపాల చిట్టా విప్పుతాం

  • మే 4 తర్వాత లెక్కలన్నీ తేలుస్తాం: మోదీ

కూచ్‌ బెహార్‌/కోల్‌కతా, ఏప్రిల్‌ 5: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఆటలు ఇక సాగవని, ఆ పార్టీకి కౌంట్‌డౌన్‌ మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. మే 4న వెలువడే ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ చేసిన ప్రతి పాపానికి లెక్క తేలుస్తామని హెచ్చరించారు. కూచ్‌ బెహార్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన టీఎంసీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా సభకు తరలివచ్చిన అశేష జనాన్ని చూసి ముగ్ధులైన ప్రధాని, ‘‘మీ ఉత్సాహం చూస్తుంటే టీఎంసీ పని అయిపోయిందని అర్థమవుతోంది’’ అని అన్నారు. ఈ ఎన్నికలతో బెంగాల్‌ నుంచి భయాన్ని తరిమికొట్టి, బీజేపీ విజయంతో ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని నింపుతామని హామీ ఇచ్చారు. ‘‘ఎన్నికల రోజున టీఎంసీ గూండాలు మిమ్మల్ని ఎంత భయపెట్టినా భయపడకండి.. మే 4 తర్వాత ఎంతటి పెద్ద గూండా అయినా సరే, చట్టం తన పని తాను చేస్తుంది. న్యాయం కచ్చితంగా జరుగుతుంది’’ అని భరోసా ఇచ్చారు. ఒకవైపు టీఎంసీ అవినీతి, చొరబాటుదారుల భయం ఉంటే, మరో వైపు అభివృద్ధిని పరుగులు పెట్టించే బీజేపీ నమ్మకం ఉందని మోదీ పేర్కొన్నారు. మాల్దాలో న్యాయాధికారులను గంటల తరబడి ముట్టడించిన ఘటనను ప్రధాని తీవ్రంగా ఖండించారు. దీన్ని టీఎంసీ ప్రభుత్వ ‘‘మహా జంగిల్‌ రాజ్‌’’గా అభివర్ణించారు. ‘‘రాష్ట్రంలో న్యాయమూర్తులకే రక్షణ లేనప్పుడు, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? మమతా బెనర్జీ ప్రభుత్వం శాంతిభద్రతలకు అంత్యక్రియలు నిర్వహిస్తోంది’’ అని మోదీ విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను టీఎంసీ గౌరవించడం లేదని, బెంగాల్‌ గడ్డపై ప్రజాస్వామ్యం ప్రతిరోజూ రక్తసిక్తమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Apr 06 , 2026 | 04:39 AM