Share News

ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసుల విస్తృత తనిఖీలు

ABN , Publish Date - Mar 02 , 2026 | 11:25 AM

దేశ రాజధాని ఢిల్లీలో పలు పాఠశాలలకు ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.

ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసుల విస్తృత తనిఖీలు
Delhi Bomb Threat

ఢిల్లీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో పలు పాఠశాలలకు ఇవాళ (సోమవారం) బాంబు బెదిరింపులు (Delhi Bomb Threat) వచ్చాయి. ఈ బెదిరింపులతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇమెయిల్ ద్వారా పాఠశాలలలో బాంబులు పెట్టినట్లు హెచ్చరికలు పంపించారు. ముఖ్యంగా మయూర్ విహార్ ప్రాంతంలోని సాల్వాన్ పబ్లిక్ స్కూల్ (Salwan Public School)తో పాటు పలు స్కూళ్లకు వచ్చిన బెదిరింపులు తీవ్ర ఆందోళనకు కారణమైంది.


ఇమెయిల్ ద్వారా బెదిరింపులు..

పాఠశాల యాజమాన్యానికి వచ్చిన ఇమెయిల్‌లో స్కూల్ ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులు, సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేసి పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.


రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్..

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సహాయంతో పాఠశాల మొత్తం తనిఖీలు నిర్వహించారు. ప్రతి తరగతి గది, ప్రాంగణం, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో పాఠశాల పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు.


బాంబు లేదని తేల్చిన పోలీసులు..

విస్తృత తనిఖీల అనంతరం ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. ఇది తప్పుడు బెదిరింపు అయ్యి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.


తల్లిదండ్రుల్లో ఆందోళన..

ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించారు. అధికారులు మాత్రం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.


భద్రతా చర్యలు కట్టుదిట్టం..

ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీలోని పాఠశాలల వద్ద భద్రతను మరింత పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 12:01 PM