Share News

రాహుల్‌కు నల్లజెండాలతో బీజేపీ కార్యకర్తల నిరసన

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:56 PM

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌ (India AI Impact Summit)కు కాంగ్రెస్ కార్యకర్తలు అంతరాయం కలిగించడంపై బీజేపీ కార్యకర్తలు శనివారంనాడు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఆ పార్టీ మద్దతుదారులు, యువజన విభాగం కార్యకర్తలు దేశవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లపైకి వచ్చారు.

 రాహుల్‌కు నల్లజెండాలతో బీజేపీ కార్యకర్తల నిరసన
BJP workers protest at Mulund

ముంబై: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌ (India AI Impact Summit)కు కాంగ్రెస్ కార్యకర్తలు అంతరాయం కలిగించడంపై బీజేపీ కార్యకర్తలు శనివారంనాడు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఆ పార్టీ మద్దతుదారులు, యువజన విభాగం కార్యకర్తలు దేశవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లపైకి వచ్చారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఢిల్లీ, సూరత్, ములుండ్, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. మహారాష్ట్రలోని ములుండ్‌లో రాహుల్ గాంధీకి నిరసనల సెగ తగిలింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒకరు వేసిన పరువునష్టం కేసులో పూచీకత్తు ఇచ్చేందుకు ఆయన థానే వెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శించారు. 'లష్కరే రాహుల్' అంటూ నినాదాలు చేశారు.


ఢిల్లీలోని ఏఐ సమిట్ హాలులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారంనాడు వీరంగం సృష్టించారు. చొక్కాలు విప్పి గాలిలోకి ఊపుతూ మోదీకి, అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి నిరసనగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణ హరి, బీహార్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుందన్ యాదవ్, ఉత్తరప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త నరసింహ యాదవ్‌లను అరెస్టు చేశారు. వీరికి కోర్టు శనివారంనాడు ఐదు రోజుల రిమాండ్ విధించింది.


ఏఐ ఈవెంట్‌కు అంతరాయం కలిగించేందుకు ముందుగానే నిర్ణయించుకున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు క్యూఆర్ కో‌డ్‌లను సంపాదించి కట్టుదిట్టమైన భద్రత కలిగిన వేదిక హాలులోకి అడుగుపెట్టినట్టు చెబుతున్నారు. వారిని గుర్తించేందుకు పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించారు. భారీ కుట్రకు ప్లాన్ జరిగిందా అనే దానిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.


ఇవి కూడా చదవండి..

ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హైఅలర్ట్..

ద్వైపాక్షిక చర్చలు.. సీఈవోలతో మంతనాలు

Updated Date - Feb 21 , 2026 | 02:59 PM