ఏఐ రంగంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:31 AM
కృత్రిమ మేధకు అత్యంత కీలకమైన సెమీకండక్టర్లు, అత్యంత అరుదైన ఖనిజ లోహాల సరఫరా గొలుసుల వంటివాటిలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా...
ప్యాక్స్ సిలికాపై భారత్ సంతకం
ఇండియాలో ఏఐ మౌలిక వసతుల కల్పనకు అమెరికా కంపెనీల నుంచి భారీ పెట్టుబడులు
కేంద్రం చేపట్టిన సెమీకండక్టర్ మిషన్‌కు ఊతం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: కృత్రిమ మేధకు అత్యంత కీలకమైన సెమీకండక్టర్లు, అత్యంత అరుదైన ఖనిజ లోహాల సరఫరా గొలుసుల వంటివాటిలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా అమెరికా చేపట్టిన ‘ప్యాక్స్ సిలికా’ అనే వ్యూహాత్మక కార్యక్రమంలో భారత్ కూడా భాగస్వామి అయింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో.. ఈ ప్యాక్స్ సిలికా డిక్లరేషన్‌పై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో చేరడంవల్ల భారత్‌కు ఏఐ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అమెరికాకు చెందిన ఏఐ కంపెనీలు భారత్‌లో ఏఐ మౌలిక వసతులపై పెట్టుబడులు పెడతాయి. మోదీ సర్కారు చేపట్టిన సెమీకండక్టర్ మిషన్‌కు బలమైన మద్దతు లభిస్తుంది. ఇండియా- అమెరికా మధ్య టెక్నాలజీ సంబంధాలు మరింత బలపడతాయి. కృత్రిమ మేధ రంగంలో చైనా గుత్తాధిపత్యాన్ని తగ్గించే అంతర్జాతీయ వ్యూహంలో భారత్ కీలక భాగస్వామి అవుతుంది.
ప్యాక్స్ సిలికా అంటే?
ప్యాక్స్ సిలికా అంటే.. లాటిన్ భాషలో ‘సిలికా శాంతి’ అని అర్థం. ఆ పేరే ఎందుకు అంటే.. చరిత్రలో ‘ప్యాక్స్ రోమనా’, ‘ప్యాక్స్ బ్రిటానికా’, ప్యాక్స్ అమెరికానా’ అనే పదబంధాలు కనిపిస్తాయి. వీటిలో ప్యాక్స్ రోమనా అంటే.. రోమన్ సామ్రాజ్య హయాంలో నెలకొన్న సుదీర్ఘ శాంతికాలం. ఇదే క్రమంలో బ్రిటిషర్ల ఆధిపత్యం కొనసాగిన కాలాన్ని ప్యాక్స్ బ్రిటానికా అని, అమెరికన్ల ఆధిపత్యం కొనసాగిన కాలాన్ని ‘ప్యాక్స్ అమెరికానా’ అని అంటారు!