8 ఏళ్ల ఏఐ మేధావి..!
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:30 AM
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో రణవీర్ సచ్‌దేవా అనే 8 ఏళ్ల చిచ్చరపిడుగు కీలక ప్రసంగంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.
ఏఐ సదస్సులో చిచ్చర పిడుగు రణ్‌వీర్ సచ్‌దేవా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో రణవీర్ సచ్‌దేవా అనే 8 ఏళ్ల చిచ్చరపిడుగు కీలక ప్రసంగంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అతి పిన్న వయసులోనే అల్గారిథంలు, తదుపరి తరం మౌలిక సదుపాయాల గురించి అలవోకగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రణ్‌వీర్ సచ్‌దేవా ఒక ఏఐ సాంకేతిక నిపుణుడు. రచయిత. అత్యంత క్లిష్టమైన ఏఐ కాన్సె్‌ప్టలను పిల్లలకు అర్థమయ్యేలా, తేలికైన కథనాలుగా సరళీకరించి చెప్పడంలో పరిణతి సాధించాడు. గతంలో ఆరేళ్ల వయసులోనే టెక్నాలజీ, కృత్రిమ మేథ ఆవిష్కరణలపై మాట్లాడిన అతి పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతని పేరు ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం ఆసియాలో ఉన్న అతి పిన్న వయస్కుడైన టెడ్‌ఎక్స్ స్పీకర్ రణ్‌వీరే. ఇండియా ఏఐ సదస్సులో రణ్‌వీర్ కృత్రిమ మేథకు పెరుగుతున్న ప్రాముఖ్యతపై మాట్లాడాడు. ఈ క్రమంలో ఆధునిక సాంకేతికత, ప్రాచీన భారతీయ తత్వశాస్త్రాల మధ్య సంబంధాన్ని హైలెట్ చేశాడు. రణ్‌వీర్ ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో మెషిన్ లెర్నింగ్ కోర్సును అభ్యసిస్తున్నాడు. అలాగే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్‌కు అంబాసిడర్‌గా, ఈసీబీ సస్టెయినబుల్ యూత్, సిటీ వన్ ఇనీషియేటివ్, చక్ర డైలాగ్స్ ఫౌండేషన్‌లకు టెక్నాలజీ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. రణ్‌వీర్ రాసిన తొలి పుస్తకం ‘ఆర్ యూ బోర్న్ విత్ ఏఐ..?’ అతనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది.