బీజేపీ.. దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది: సీఎం మమత
ABN , Publish Date - Jan 23 , 2026 | 06:00 PM
నేతాజీ సుభాశ్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారామె. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, బీఆర్ ఆంబేడ్కర్ వంటి జాతీయ ప్రముఖులను బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అవమానించాయని ఆమె వ్యాఖ్యానించారు. నేతాజీ.. భారత స్వాతంత్ర సంగ్రామంలో పోషించిన పాత్ర అసమానమైనదని.. ఆయనను కేవలం ఒక విగ్రహానికో లేదా ఫొటోకో పరిమితం చేయకూడదని పేర్కొన్నారు దీదీ.
‘ఢిల్లీ ఛలో’ నినాదాన్ని గుర్తు చేసుకుంటూ.. కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌పై కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు మమత. మన సంస్కృతి, భాషను కాపాడుకోవడానికి అందరం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. జనవరి 23ను ‘జాతీయ సెలవు దినం’గా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నేతాజీ ఆశయాలను గౌరవించాలంటే సెలవు ప్రకటించడమే కాదు.. ఆయన ఆశయాలను, భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మన దేశ చరిత్రను బీజేపీ పూర్తిగా వక్రీకరిస్తుందన్నారు. ఇప్పటికైనా నేతాజికి సంబంధించిన సమాచారం మొత్తం బహిర్గతం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారామె.
ఇవీ చదవండి:
బ్రెజిల్ ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని మోదీ
తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్