భయమెరుగని నాయకత్వ పటిమకు నేతాజీ ప్రతీక: ప్రధాని మోదీ
ABN , Publish Date - Jan 23 , 2026 | 09:37 AM
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. భయమెరుగని నాయకత్వ పటిమకు ప్రతీకగా నిలిచే నేతాజీ జయంతిని యావత్ దేశం పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటోందని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తి అని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నివాళులు అర్పించారు. భయమెరుగని నాయకత్వానికి, అచంచల దేశభక్తికి నేతాజీ ప్రతీక అని కొనియాడారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ధైర్యసాహసాలు, పట్టుదలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతీక అని, దేశానికి ఆయన సేవలు అనితరసాధ్యమని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆయన జయంతిని యావత్ దేశం పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటోందని అన్నారు. అచంచల దేశభక్తికి, భయమే తెలియని నాయకత్వ పటిమకు అసలైన ప్రతీకగా నిలిచే నేతాజీ రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివస్‌గా కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి ఏడాది కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించింది. ఇక 2023లో అండమాన్, నికోబార్ దీప సముదాయంలోని 21 ద్వీపాలకు పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లను ఖరారు చేసింది.
ఇవీ చదవండి:
బ్రెజిల్ ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని మోదీ
తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్