విజయ్ పార్టీతో పొత్తులేదు..
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:26 PM
ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఎన్డీయే పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు.
బీజేపీ చీఫ్ నయినార్ నాగేంద్రన్
చెన్నై: ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఎన్డీయే పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. కరూర్ దుర్ఘటనకు సంబంధించి విజయ్‌కి సీబీఐ సమన్లు ఇవ్వడం, ఆయన నటించిన ‘జననాయగన్’ సినిమా సెన్సార్ ప్రక్రియలో జాప్యానికి బీజేపీ కారణం కాదన్నారు. ఆ రెండు వ్యవహారాల్లో టీవీకేపై బీజేపీ ఒత్తిడి చేసి పొత్తుకు ప్రయత్నిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వదంతులను ఆయన ఖండించారు.
బుధవారం తిరుచ్చిలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్న భారీ సభ ఏర్పాట్లపై తంజావూరు జిల్లా కుంభకోణంలో పార్టీ నాయకులతో ఆయన సమీక్ష జరిపారు. ఆ సమవేశం అనంతరం నయినార్ నగేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ... టీవీకే ఆధ్వర్యంలో కరూర్ వేలుచ్చామిపురంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందిన వ్యవహారంలో మంగళవారం విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ అధికారులు పంపిన ఉత్తర్వులకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. విజయ్‌ను బెదిరించి ఎన్డీయే కూటమిలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మరోవైపు బీజేపీతో పొత్తు ఖరారైందని సోషల్ మీడియాల్లో వస్తున్న కథనాలన్నీ అవాస్తవమన్నారు.
అన్నాడీఎంకే, పీఎంకే, టీఎంసీ తదితర పార్టీలతో తమ కూటమి బలంగానే ఉందని, త్వరలోనే సీట్ల సర్థుబాటు చర్చలు ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్రానికి ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారని, ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ తరుఫున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుచ్చి మహానాడులో ప్రధాని కొత్త ప్రకటనలు చేసే అవకాశముందన్నారు. ఈ ఐదేళ్ల డీఎంకే పాలనలో 34 లాకప్ మరణాలు జరిగాయని, మరోవైపు జరుగుతున్న హత్యలకు సీఎం స్టాలిన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని నాగేంద్రన్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్ప తగ్గుదల.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
పోలవరం జిల్లాలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
Read Latest Telangana News and National News