డేటింగ్ యాప్‌లో పరిచయం.. స్నేహమంటూ దగ్గరై 51 ఏళ్ల వ్యక్తిని
ABN , Publish Date - Mar 10 , 2026 | 09:49 AM
డేటింగ్ యాప్ పేరుతో పరిచయమై 51 ఏళ్ల వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడి వద్ద నుంచి దాదాపు రూ.25 లక్షలు కాజేశారు కేటుగాళ్లు.
హైదరాబాద్, మార్చి 10: డేటింగ్ యాప్‌లో ‘స్నేహం’ పేరుతో దగ్గరై ఒంటరి జీవితం గడుపుతున్న వ్యక్తిని సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ట్రేడింగ్, ఐపీఓల పేరుతో మోసం చేసి సదరు వ్యక్తి నుంచి దాదాపు 25 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బడాంగ్‌పేట్‌కు చెందిన 51 ఏళ్ల వ్యక్తి.. భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నారు. తోడు కోసం డేటింగ్ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. అక్కడ ఓ యువతితో పరిచయం అయ్యింది.
స్నేహం పేరుతో దగ్గరై ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా మంచి లాభాలు వస్తాయని నమ్మించారు సైబర్ నేరగాళ్లు. కొంతమంది లాభాలు చూపించి బాధితుడిని ఆకర్షించారు. తర్వాత ఐపీఓలు కొంటే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో బాధితుడు పలు మార్లు ట్రాన్సాక్షన్ల ద్వారా డబ్బులు పంపించారు. మొత్తం 25 లక్షల రూపాయల వరకు పంపించారు. చివరకు లాభాలు రాకపోవడంతో నిజం తెలిసిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేపట్టారు. డేటింగ్ యాప్‌లలో అపరిచితులతో పరిచయాలు పెట్టుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. అనుమానాస్పదంగా డబ్బులు అడిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇలాంటి మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
సోషల్ మీడియాలో వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి
ఢిల్లీ మద్యం స్కాం రౌజ్ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే
Read Latest Telangana News And Telugu News