యూసీసీ అమలు, లవ్ జిహాద్‌కు చెక్.. అస్సాంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:08 PM
అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ మంగళవారంనాడు విడుదల చేసింది. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మూడు నెలల్లోపు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని భరోసా ఇచ్చింది.
గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ (BJP) మంగళవారంనాడు విడుదల చేసింది. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మూడు నెలల్లోపు ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమలు చేస్తామని భరోసా ఇచ్చింది. 'లవ్ జిహాద్', 'ల్యాండ్ జిహాద్'కు చరమగీతం పాడేందుకు సమర్థవంతమైన చట్టాన్ని తీసుకువస్తాయని పేర్కొంది. 31 వాగ్దానాలతో కూడిన బీజేపీ 'సంకల్ప్ పత్ర'ను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు విడుదల చేశారు.
ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) అమలు చేయడం ద్వారా అస్సాం నాగరికత, వారసత్వం, ప్రజల హక్కులను పరిరక్షిస్తామని, ఆరో షెడ్యూల్, ఎస్టీ ప్రాంతాలు మినహా అంతటా యూసీసీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో బీజేపీ వాగ్దానం చేసింది. ల్యాండ్, హెరిటేజ్, స్థానికుల హక్కులను కాపాడేందుకు ఇమిగ్రెంట్స్ యాక్ట్-1950ను అమలు చేస్తామని, అక్రమ వలసదారులు ఆక్రమించుకున్న భూములను కనిపెట్టి, వెనక్కి తీసుకుంటామని పేర్కొంది. నిజమైన అస్సాం పౌరులకు భూమి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ఇండియాన్ ఈస్ట్రన్ గేట్‌వేగా అస్సాంను తీర్చిదిద్దేందుకు రూ.5 లక్షల కోట్లు వెచ్చిస్తామని, వరదల నుంచి అస్సాంకు విముక్తి కల్పించేందుకు 'వరద నిరోధక మిషన్' ప్రారంభించి రూ18,000 కోట్లు వెచ్చిస్తామని పేర్కొంది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక యూనివర్శిటీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం అందిస్తామని, లఖ్‌పతి దీదీ పథకం కింద 40 లక్షల మంది మహిళలకు ప్రోత్సాహకాలు ఇస్తామని, టీ తోటల కార్మికుల వేతనాలను రాబోయే ఐదేళ్లలో రోజుకు రూ.500 చొప్పున పెంచుతామని, ఇళ్లు కట్టించి ఇస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీకి ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్
బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత