Share News

బీజేపీలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్.. బెంగాల్‌ నుంచి పోటీ

ABN , Publish Date - Mar 31 , 2026 | 02:44 PM

టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు, 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత లియాండర్ పేస్ భారతీయ జనతా పార్టీలో మంగళవారంనాడు చేరారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

బీజేపీలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్.. బెంగాల్‌ నుంచి పోటీ
Leander Paes

న్యూఢిల్లీ: టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు, 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత లియాండర్ పేస్ (Leander Paes) భారతీయ జనతా పార్టీ (BJP)లో మంగళవారంనాడు చేరారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో లియాండర్ పేస్ పోటీ చేసే అవకాశం ఉంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


పార్టీలో చేరే అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఈ సందర్భంగా లియాండర్ పేస్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది టికెట్ వ్యవహారం కాదని, ఇదో బాధ్యతని చెప్పారు. 'ఖేలో ఇండియా'తో దేశానికి, యువతకు సేవచేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. యువతకు ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని అదే అకింతభావంతో యువతపై తాను దృష్టి సారిస్తానని చెప్పారు.


లియాండర్ పేస్‌కు కోల్‌కతా వంటి అర్బన్ ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఉండటంతో ఆయనను పశ్చిమబెంగాల్ ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. పేస్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్‌తో ఎగువ మధ్య తరగతి ఓటర్లు, పట్టణ ప్రాంత నియోజకవర్గాలు, క్రీడాభిమానులను మరింతగా ఆకర్షించవచ్చని బీజేపీ భావిస్తోంది.


దేశంలోని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుల్లో ఒకరైన లియండర్ పేస్.. టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ ఖ్యాతి పొందారు. ఒలింపిక్ మెడల్ విజేత మాత్రమే కాకుండా ఏడు ఒలింపిక్స్ గేమ్స్ ఆడిన క్రెడిట్ ఆయనదే. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుని టెన్నిస్‌లో ఒలింపిక్ మెడల్ గెలుచుకున్న తొలి ఆసియన్‌గా గుర్తింపు పొందారు. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో ఆనేక విజయాలను ఆయన సొంతం చేసుకున్నారు. ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్స్‌లో మూడుసార్ల చొప్పున, ఆస్ట్రేలియా, వింబుల్డన్ టైటిల్స్‌ను ఒక్కోసారి గెలుచుకోవడమే కాకుండా మెన్స్ డబుల్స్‌లో పలు టైటిల్స్ గెలుచుకున్నారు. 10 మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకుని టెన్నిస్ చరిత్రలోనే అత్యంత సక్సెస్‌పుల్ డబుల్ ప్లేయర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇండియాలోని ప్రముఖ టెన్నిస్ ప్లేయర్లలో ఒకరైన మహేశ్ భూపతి భాగస్వామ్యంతో అనేక విజయాలు సాధించారు పేస్. ప్రస్తుతం.. బెంగాల్ టెన్నిస్ అసోయేషన్ అధ్యక్షుడిగా లియాండర్ పేస్ ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు

కేరళం ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

Updated Date - Mar 31 , 2026 | 03:09 PM