TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:10 AM
TVK పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌పై చెన్నైలోని పెరవల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌తో పాటు సుమారు 5 వేల మంది పార్టీ కార్యకర్తలపైనా కేసులు పెట్టారు. అనుమతికి మించి లౌడ్‌స్పీకర్లు, అంబులెన్స్‌కు ఆటంకం కల్పించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.
చెన్నై, మార్చి 31: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌పై చెన్నైలోని పెరవల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌తో పాటు సుమారు 5 వేల మంది పార్టీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
ఇటీవల విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కుమార్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో.. అనుమతికి మించి లౌడ్‌స్పీకర్లు ఉపయోగించారని, సభలో సుమారు 30 లౌడ్‌స్పీకర్లను వినియోగించి శబ్ద కాలుష్య నియమాలను అతిక్రమించాని పేర్కొన్నారు. భారీ జనసమూహం కారణంగా అత్యవసర సేవలకు వినియోగించే అంబులెన్స్ మార్గానికి అడ్డుపడ్డారని ఫిర్యాదు చేశారు. దీనితోపాటు, పరిమితికి మించి జనాన్ని సమీకరించడం వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలగించారని సదరు అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఐదు సెక్షన్ల కింద కేసులు
మానిటరింగ్ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. పబ్లిక్ న్యూసెన్స్ సృష్టించడం, ప్రజా మార్గాన్ని అడ్డుకోవడం, గుంపులు కట్టడం వంటి ఆరోపణలతో మొత్తం ఐదు సెక్షన్ల కింద ఈ కేసులను నమోదు చేశారు.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రచార కార్యక్రమాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయితే, ఈ నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న కారణంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు