బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:28 PM
భారతీయ జనతా పార్టీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బీజేపీని 'అనాగరిక' పార్టీగా అభివర్ణించారు. దేశంలో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను టార్గెట్ చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులు, అవమానాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
బంకురా: భారతీయ జనతా పార్టీ (BJP)పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) నిప్పులు చెరిగారు. బీజేపీని 'అనాగరిక' పార్టీగా అభివర్ణించారు. దేశంలో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను టార్గెట్ చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులు, అవమానాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బాంకురాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ ప్రసంగించారు.
టీఎంసీ అభ్యర్థులు ఎవరనేది కాకుండా తన నాయకత్వాన్ని మాత్రమే చూడాలని ఈ సందర్భంగా ఓటర్లను మమతా బెనర్జీ కోరారు. 294 నియోజకవర్గాల్లో తననే అభ్యర్థిగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో అవకతలను ప్రధానంగా ఆమె తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, ఒకేరోజు 30,000 అప్లికేషన్లు దాఖలైనట్టు పార్టీ నేత అభిషేక్ బెనర్జీ వద్ద సమాచారం ఉందని తెలిపారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు బిహార్, రాజస్థాన్, హరియాణ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఓటర్లను బీజేపీ దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోందని ఆరోపించారు. 'బిహార్‌లో చేసినట్టుగానే రైల్వేలను ఉపయోగించుకుని బయట ప్రాంతాల నుంచి ఓటర్లను రప్పించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది' అని అన్నారు.
ఈసీఐపై విమర్శలు
భారత ఎన్నికల కమిషన్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ చెప్పినట్టు ఈసీఐ నడుచుకుంటోందని, బీజేపీ-ఈసీ కలిసి ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులను ఊడలాక్కుంటాయని ఆరోపించారు. ఓటర్ల లిస్ట్‌లో కొందరిని టార్గెట్ చేసి తొలగించడం, మరికొందరిని జాబితాలో చేర్చడం జరుగుతోందన్నారు. తప్పుడు ఫారం-6 అప్లికేషన్లతో బిహార్ ఓటర్ల జాబితాలో చేరేందుకు ప్రయత్నించిన పలువురు బీజేపీ కార్యకర్తలు పట్టుబడినట్టు చెప్పారు. ఇది కేవలం ఓటర్ల హైజాకింగ్ కిందకే వస్తుందన్నారు. చట్టబద్ధత కలిగిన 60 లక్షల అప్లికేషన్లు ఇప్పటికే పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. బల్క్ ఎంట్రీలను మాత్రం ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నారని అన్నారు. ఇదెంతమాత్రం రొటీన్ ప్రక్రియ కాదని, స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించడంపై జరుగుతున్న దాడి అని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్‌లో మాంసాహారంపై నిషేధం విధిస్తుందని, దొడ్డిదారిన ఎన్ఆర్‌సీ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సాంస్కృతిక ఆంక్షలు, వివాదాస్పద విధానాలు అమలు చేస్తుందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్
బీజేపీలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్.. బెంగాల్ నుంచి పోటీ