లెబనాన్‌లో ‘బ్లూ హెల్మెట్స్’పై దాడుల్ని తీవ్రంగా ఖండించిన భారత్
ABN , Publish Date - Mar 31 , 2026 | 09:30 AM
లెబనాన్‌లో ‘బ్లూ హెల్మెట్స్’పై దాడుల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. శాంతి పరిరక్షకుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేసింది. లెబనాన్ మిషన్‌లో కూడా భారత సైనికులు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రజ్యోతి, మార్చి 31: లెబనాన్‌లో శాంతి స్థాపన కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ బలగాలపై (UNIFIL) ఇటీవల జరిగిన దాడులను భారతదేశం తీవ్రంగా పరిగణించింది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ప్రాణాలు కోల్పోయిన శాంతి పరిరక్షకులకు (Blue Helmets) భారత్ ఘన నివాళులర్పించింది.
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, వారిపై దాడులు ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల ధైర్యసాహసాలను భారత్ కొనియాడింది. అంతర్జాతీయ శాంతి కోసం వారు చేసిన కృషి వెలకట్టలేనిదని పేర్కొంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల శాంతి దళాల ఉనికికి ముప్పు వాటిల్లుతోందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలకు అత్యధిక సంఖ్యలో సైనికులను పంపే దేశాల్లో భారతదేశం ఒకటి. లెబనాన్ (UNIFIL) మిషన్‌లో కూడా భారత సైనికులు గణనీయమైన సంఖ్యలో సేవలందిస్తున్నారు. అందుకే ఈ దాడుల పట్ల భారత్ తక్షణమే స్పందించింది. శాంతి దళాలు, వారి భద్రతను గౌరవించడం ప్రతీ దేశపు బాధ్యత అని భారత్ గుర్తు చేసింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సంబంధిత పక్షాలకు భారత్ సూచించింది.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య జరుగుతున్న పోరాటం కారణంగా లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఐరాస దళాలున్న ప్రాంతాల్లో దాడులు జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. 'శాంతి పరిరక్షకులు ఏ పక్షానికీ చెందిన వారూ కాదు, వారు కేవలం శాంతి కోసమే అక్కడున్నారు. వారిపై దాడులు చేయడమంటే అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలపై దాడి చేయడమే.' అని భారత దౌత్య వర్గాలు తేల్చిచెప్పాయి. కాగా, దక్షిణ లెబనాన్‌లో జరిపిన దాడిలో ఇద్దరు UNIFIL శాంతిదూతలు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. అయితే, ఈ దాడులకు పాల్పడిందెవరనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు