Share News

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:13 PM

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో ఎల్డీఎఫ్ జత కట్టిందని ఆరోపించారు. అందువల్లే ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ గెలవాలని మోదీ కోరుకుంటున్నారని అన్నారు.

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్
Rahul Gandhi

కన్నూరు: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(LDF), బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో ఎల్డీఎఫ్ జత కట్టిందని ఆరోపించారు. అందువల్లే ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ గెలవాలని మోదీ కోరుకుంటున్నారని అన్నారు. బీజేపీతో కూడిన ఎల్డీఎఫ్‌కు, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్‌కు మధ్యే ఎన్నికల పోరాటం జరుగుతోందన్నారు. కన్నూరులో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తున్న సీపీఎం మాజీ నేతలు వి.కున్హికృష్ణన్, టీవీ గోవిందన్‌లు కూడా రాహుల్ ప్రసంగించిన వేదికపై పాల్గొన్నారు.


రెండు సిద్ధాంతాల మధ్య పోరు

ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాలకు మధ్య జరుగుతున్న పోరని, తొలిసారి బీజేపీ-లెఫ్ట్ ఫ్రంట్ చేతులు కలపడం అంతా చూస్తున్నామని రాహుల్ అన్నారు. బీజేపీతో ఎల్డీఎఫ్ జత కట్టడం ఇష్టంలేకనే ఆ పార్టీలోని కొందరు సీనియర్లు యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని చెప్పారు. లెఫ్ట్ ఫ్రంట్ ఇంకెంతమాత్రం వామపక్ష పార్టీ కాదని, అతివాద రైట్‌వింగ్ పార్టీ అని పేర్కొన్నారు.


శబరిమలపై ఎందుకు మౌనం?

ప్రధానమంత్రి ఎక్కడకు వెళ్లినా ఆలయాలు, మతం గురించి మాట్లాడతారని.. కానీ ఇక్కడకు వచ్చినప్పుడు మాత్రం శబరిమల ఆలయంలో బంగారం తాపడాలు మాయం కావడంపై ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్ ప్రశ్నించారు. రాష్ట్రంలో లెఫ్ట్‌ ఫ్రంట్ తిరిగి గెలవాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదని అన్నారు. సీపీఎంను బీజేపీ కంట్రోల్ చేస్తోందని, యూడీఎఫ్‌‌ను మాత్రం కాదని చెప్పారు. తనకు సవాల్ విసరగలిగే సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందనే విషయం మోదీకి బాగా తెలుసునని అన్నారు. మోదీని కాంగ్రెస్ ప్రతిఘటించడం అందరికీ తెలుసునని, కానీ మోదీని కేరళ సీఎం కానీ, కేరళ సీఎంను మోదీ కానీ విమర్శించడం ఎవరూ విని ఉండరని రాహుల్ అన్నారు.


ఇవి కూడా చదవండి..

బీజేపీలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్.. బెంగాల్‌ నుంచి పోటీ

TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు

Updated Date - Mar 31 , 2026 | 04:45 PM