ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బీజేపీ-అకాలీదళ్.. ఢిల్లీలో అధికారిక ప్రకటన
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:28 PM
ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ బీజేపీ-శిరోమణి అకాలీదళ్ ఒక్కటవుతున్నాయి. ఇవాళ ఢిల్లీలో అధికారికంగా పొత్తు ప్రకటన వెలువడనుంది. దీంతో 2027 పంజాబ్ ఎన్నికలకు సన్నాహాలు షురూ అయ్యాయి.
ఢిల్లీ / చండీగఢ్, నవంబర్ 24: 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంటోంది. ఆరేళ్ల క్రితం విడిపోయిన పాత మిత్రపక్షాలు భారతీయ జనతా పార్టీ (BJP), శిరోమణి అకాలీదళ్ (SAD) మళ్లీ చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయి. నేడు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఇరు పార్టీలు తమ పొత్తును అధికారికంగా ప్రకటించనున్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ఈ పొత్తును ప్రకటించనున్నారు.
గురునానక్ దేవ్ 556వ ప్రకాష్ పురబ్ (జయంతి) పర్వదినం రోజునే ఈ ప్రకటన వెలువడుతుండటం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పంజాబ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్, మాజీ అధ్యక్షులు సునీల్ జాఖర్, అశ్వని కుమార్ సహా సీనియర్ అకాలీదళ్ నేత బల్దేవ్ సింగ్ భుందర్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
ఎందుకు విడిపోయారు? మళ్లీ ఎలా కలిశారు?
దాదాపు 24 ఏళ్ల పాటు కలిసి ప్రయాణించిన ఈ రెండు పార్టీలు, కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో 2020 సెప్టెంబర్లో విడిపోయాయి. ఆ సమయంలో అకాలీదళ్ ఎన్డీయే (NDA) కూటమి నుంచి బయటకు రాగా, హర్సిమ్రత్ కౌర్ బాదల్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. గత కొద్ది నెలలుగా ఇరు పార్టీల మధ్య మళ్లీ సయోధ్య కుదిరే ప్రయత్నాలు జరిగాయి. ఇటీవల సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం, పంజాబ్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని అమిత్ షా సంకేతాలు ఇవ్వడంతో ఈ పొత్తు ఖరారైంది.
2022 ఎన్నికల అనుభవం: 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి 2022లో జరిగిన ఎన్నికల్లో ఇరు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యాయి (అకాలీదళ్ 3 సీట్లు, బీజేపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి).
కొత్త వ్యూహం: ఈసారి పొత్తులో భాగంగా బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు, గ్రామీణ, పంథిక్ (సిక్కు) నియోజకవర్గాల్లో తన సంప్రదాయ ఓటు బ్యాంకును తిరిగి నిలుపుకోవడంపై అకాలీదళ్ దృష్టి సారించింది. బీజేపీ-అకాలీదళ్ కలయికతో 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ పార్టీల ఎన్నికల వ్యూహాలపై గట్టి ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు, ఈ పొత్తుపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.(BJP-SAD Reunion)
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!