బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లికి 4 లక్షల మంది.. ప్రధాని మోదీకీ ఆహ్వానం!
ABN , Publish Date - Nov 09 , 2026 | 09:53 PM
ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన కూతురి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈనెల 25న జరగనున్న ఈ పెళ్లి వేడుకకు 4 లక్షల మందికి విందు ఇవ్వనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన కూతురి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈనెల 25న జరగనున్న ఈ పెళ్లి వేడుకకు 4 లక్షల మందికి విందు ఇవ్వనున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతిఒక్కరినీ ఆహ్వానిస్తామని అనంత్ సింగ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. ఆయన కూతురు శివంగి సింగ్‌కు రిషికేశ్ కుమార్‌తో ఈనెల 25న వివాహం జరగనుంది. అనంత్ పూర్వీకుల గ్రామం లడ్మాలో పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ పందిళ్లు, వధూవరుల వేదిక నిర్మాణ బాధ్యతలను ఉత్తరప్రదేశ్‌లోని మౌ ప్రాంతానికి చెందిన కళాకారులకు అప్పగించారు. ఈనెల 20 నాటికి పందిళ్ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా మరో పందిరిని ఏర్పాటు చేస్తున్నారు.
సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు
వధూవరుల కోసం 100 అడుగుల పొడవైన సిమెంట్ వేదికను నిర్మిస్తున్నారు. దీనిని 150 క్వింటాళ్ల ఆభరణాలతో అలంకరించనున్నారు. వివాహం అనంతరం పెళ్లికొడుకు కుటుంబం బిహార్‌లోని బిహ్తా ప్రాంతంలో ఉన్న రామకృష్ణ నగర్‌కు వెళ్లనుంది. అక్కడే నిర్మించిన కొత్త ఇంట్లో శివంగి నివాసం ఉండనుంది. పెళ్లికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకలను ఈ ఇంట్లోనే నిర్వహించనున్నారు. బిహ్తా నుంచి బయలుదేరే ఊరేగింపు (బారాత్) అనంత్ సింగ్ స్వగ్రామమైన లడ్మాకు చేరుకోనుంది. ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్, మనోజ్ తివారీ సహా సుమారు 36 మంది సినీ ప్రముఖులు హాజరుకానున్నట్ సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం పంపామని అనంత్ సింగ్ వెల్లడించారు.
మరోవైపు, కుమార్తె వివాహం జరిగిన ఆరు రోజులకే అనంత్ సింగ్ అధికారుల ఎదుట లొంగిపోవాల్సిన పరిస్థితి. దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిరుడు అక్టోబర్‌లో అరెస్టయిన ఆయన.. ఈ ఏడాది మార్చిలో బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, గత నెలలో సుప్రీంకోర్టు ఆయనను డిసెంబర్ 1లోగా లొంగిపోవాలని ఆదేశించింది. కాగా.. మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోసం తొమ్మిది మందిని హత్య చేయించానని గతంలో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు.. జనవరిలో మోగనున్న నగారా!
తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు