Share News

ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో యూపీ పట్టణం లోనీ

ABN , Publish Date - Nov 09 , 2026 | 08:00 PM

ఉత్తరప్రదేశ్‌లో లోనీ పట్టణంలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చిన కొన్ని గంటల్లోనే అక్కడి గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది.

ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో యూపీ పట్టణం లోనీ

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో లోనీ పట్టణంలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చిన కొన్ని గంటల్లోనే అక్కడి గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోనీ టౌన్.. జాతీయ రాజధాని ప్రాంతంలో అత్యంత కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. గత 12 నెలల్లో ఈ పట్టణంలో సగటు పీఎం 2.5 స్థాయులు ప్రతి క్యూబిక్ మీటరుకు 112.5 మైక్రోగ్రాములుగా రికార్డయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన వార్షిక పరిమితి 5 మైక్రోగ్రాములతో పోలిస్తే ఇది 22 రెట్లకుపైగా అధికం. స్విట్జర్లాండ్‌కు చెందిన వాయు నాణ్యత పర్యవేక్షణ సంస్థ ఐక్యూఎయిర్ విడుదల చేసిన వార్షిక నివేదికలో ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాలో లోనీ స్థానం దక్కించుకుంది. గాలిలో ఆ స్థాయిలో సూక్ష్మ ధూళికణాలు ఉంటే క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


లోనీలో కాలుష్యానికి కారణాలు

లోనీ పట్టణంలో వాయు కాలుష్యం పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతం చుట్టూ పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వాడలు ఉండడంతో వాటి నుంచి వచ్చే పొగ గాలి నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. అంతేకాకుండా నివాస ప్రాంతాల్లోనే చిన్నతరహా పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. కొందరు ఇళ్ల వద్దే కొలిమిలను ఏర్పాటు చేసి లోహాలను కరిగిస్తున్నారు. ఈ క్రమంలో వెలువడే విషపూరిత రసాయన వాయువులు గాలిలో కలుస్తున్నాయి. మరోవైపు పట్టణంలోని అధ్వానమైన రహదారులు కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఢిల్లీ, ఘజియాబాద్, బాగ్‌పత్ నగరాల మధ్య ఉన్న లోనీలో తక్కువ ధరకు భూములు లభిస్తుండడంతో ఇళ్ల నిర్మాణాలు నిరంతరం కొనసాగుతున్నాయి. దీనికి తోడు పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. భారీగా తవ్వకాలు చేపట్టడం వల్ల దుమ్ము, ధూళి గాలిలో కలిసి కాలుష్యాన్ని పెంచుతున్నాయి.


ఢిల్లీ నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు లోనీ కీలక మార్గంగా ఉంది. ఇటీవల నిర్మించిన ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేలు కూడా ఈ ప్రాంతానికి సమీపంలోనే ఉన్నాయి. ఈ మార్గాలపై నిత్యం పెద్ద సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ముతో లోనీలో కాలుష్యం పెరుగుతోంది.


చెత్త, పంటవ్యర్థాల దహనంతో విషపూరిత పొగ..

లోనీలో చెత్త నిర్వహణ కూడా ప్రధాన సమస్యగా మారింది. స్థానికులు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేయడం లేదా అక్కడే తగలబెట్టడం వంటివి చేస్తున్నారు. దీంతో విషపూరితమైన పొగ వెలువడి గాలిలో కలుస్తోంది. అలాగే పంట వ్యర్థాలను తగలబెట్టడం కూడా లోనీలో కాలుష్యం పెరిగేందుకు కారణం అవుతోంది. దీనికితోడు పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వచ్చే పొగతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని గ్రామాల నుంచి వెలువడే పొగ కూడా లోనీ గాలి నాణ్యతపై ప్రభావం చూపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు.. జనవరిలో మోగనున్న నగారా!

తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు

Updated Date - Nov 09 , 2026 | 08:00 PM