ముంబైలో ఏరియల్ ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం
ABN , Publish Date - Nov 09 , 2026 | 05:19 PM
దీపావళి వేడుకల్లో అగ్నిప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముంబై విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాకెట్లు, గాల్లోకి ఎగిరి పేలిపోయే ఏరియల్ ఫైర్ క్రాకర్స్‌ను నవంబర్ 25 వరకూ నిషేధిస్తున్నట్టు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి వేడుకల్లో అగ్నిప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముంబై విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాకెట్లు, గాల్లోకి ఎగిరి పేలిపోయే ఏరియల్ ఫైర్ క్రాకర్స్‌ను నవంబర్ 25 వరకూ నిషేధిస్తున్నట్టు తెలిపింది. నగరవ్యాప్తంగా ఈ నిషేధం అమల్లో ఉంటుందని చెప్పింది. పబ్లిక్, ప్రైవేటు ప్రదేశాలతో పాటు భవనాలు, టెర్రస్‌లు, బాల్కనీలు, పార్కింగ్ స్థలాలు, స్లమ్ ఏరియాలు సహా ఎక్కడా ఈ టపాసులను కాల్చకూడదని స్పష్టం చేసింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిషేధం నవంబర్ 25 రాత్రి 11.59 గంటల వరకూ అమల్లో ఉంటుందని నగర విపత్తు నిర్వహణ సంస్థ ఇన్‌చార్జ్ చైర్‌పర్సన్, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
రాకెట్లు, గాల్లోకి ఎగిరి పేలే ఇతర టపాసులు భవనాలపై, బాల్కనీలు, కిటికీలు, పేలుడు పదార్థాలపై పడి అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. జనసాంద్రాత అధికంగా ఉన్న ప్రాంతాలు, బహుళ అంతస్తుల భవనాలు, ఇరుకు సందులు, వాణిజ్య సముదాయాలకు ఏరియల్ ఫైర్ క్రాకర్స్ వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ముప్పు మరింత ఎక్కువగా ఉందని తెలిపింది. ఈ అంశంపై ముంబై మేయర్ నీతు తావ్డే మాట్లాడుతూ భవనాలకు సమీపంలో టపాసులు కాల్చవద్దని ప్రజలకు విజ్ఞప్తి కూడా చేశారు.
నవంబర్ 8న నగరంలో 137 అగ్నిప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మహిళలు గాయపడ్డట్టు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. టపాసుల వల్ల అగ్నిప్రమాదాల సంఖ్య గతంతో పోలిస్తే పెరిగిందని అధికారులు చెబుతున్నారు. దీపావళి సందర్భంగా 2024లో ముంబైలో 262 అగ్నిప్రమాదాలు సంభవించాయి. వీటిల్లో 80 టపాసుల వల్లే జరిగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించారు. ఇక 2025లో 289 అగ్నిప్రమాదాలు జరగ్గా వీటిల్లో టపాసుల వల్ల సంభవించిన ప్రమాదాలు 113. అయితే, గతేదాడి ప్రమాదాల్లో మరణాలేవీ నమోదు కాలేదు.
ఈ వార్తలనూ చదవండి:
యూపీ ఎన్నికలు.. 209 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు
మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి