Share News

బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తుండగా గల్లంతైన హెలికాప్టర్

ABN , Publish Date - Oct 30 , 2026 | 03:54 PM

బద్రినాథ్ వెళ్లి తిరిగి వస్తోన్న ఓ హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ సమీపాన అదృశ్యమైంది. ఈ మేరకు సమాచారం అందుకున్న రెస్క్యూ టీం, ఆర్మీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తుండగా గల్లంతైన హెలికాప్టర్
helicopter missing in badrinath

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌లోని సహస్రధారకు బయలుదేరిన ట్రాన్స్ భారత్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన హెలికాప్టర్ ఆచూకీ గల్లంతైంది. VT-HCX కాల్‌సైన్‌తో ఉన్న ఈ హెలికాప్టర్ మధ్యాహ్నం 1:14 గంటల సమయంలో బయలుదేరింది. జోషిమఠ్ లోయ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్‌తో కమ్యూనికేషన్ తెగిపోయింది. అదే సమయంలో ట్రాకింగ్ వ్యవస్థతోనూ సంబంధాలు కోల్పోయింది.

హెలికాప్టర్‌లో పైలట్ సహా మొత్తం ఆరుగురు ఉన్నట్లు ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి సంస్థ వెల్లడించింది. పైలట్ కెప్టెన్ హిమాన్షుతోపాటు ప్రతాప, అరుణ్, శంకర్ గౌడ, సుధీర్ కె., హెచ్‌.ఎస్‌. నటరాజ ప్రయాణిస్తున్నట్లు తెలిపింది.


కాగా, గల్లంతైన హెలికాప్టర్ జేపీ పవర్‌ హౌస్‌ మార్గంలోని పర్వత ప్రాంతంలో కుప్పకూలినట్లు అధికారులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి పొగ వస్తున్నట్లు గుర్తించామని.. సహాయక బృందాలను పంపించినట్లు ఉత్తరాఖండ్ ఉన్నతాధికారులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే భారత సైన్యం, చమోలీ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలను రంగంలోకి దించినట్లు జోషిమఠ్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ వశిష్ఠ తెలిపారు.


మరోవైపు హెలికాప్టర్ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. జోషిమఠ్ సమీపంలోని చాయీ గ్రామం వద్ద హెలికాప్టర్ కూలినట్లు సమాచారం అందిందని ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఘటనాస్థలంలో జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయన్నారు. హెలికాప్టర్‌లోని ప్రయాణికులంతా సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

కుట్ర రాజకీయాలకు తెరలేపిన వైఎస్ జగన్: దేవినేని ఉమా

ఐపీఎల్ 2028: గంభీర్‌ కోసం నాలుగు ఫ్రాంచైజీల పోటీ.. కోచ్‌గా చేరాలంటూ..!

రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ 24వ విడత నిధులు.. 9.34 కోట్ల మందికి రూ.18,680 కోట్లు!

Updated Date - Oct 30 , 2026 | 04:42 PM